దేశంలో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మూకదాడులను అరికట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసిన వారిపై కేసులు పెట్టడం గమనార్హం. వారు దేశ ప్రతిష్టను తీశారంటూ ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారట!
ఇటీవల కొంతమంది మేధావి వర్గం మూకదాడుల విషయంలో స్పందించిన సంగతి తెలిసిందే. బీఫ్ తింటున్నారంటూ, జై శ్రీరామ్ అనాలంటూ.. కొంతమంది మంద కొందరిపై దాడులు చేసింది. ఈ దాడుల్లో గాయపడ్డవారు, మరణించిన వారున్నారు. ఈ వ్యవహారాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయ్యింది. ఇలాంటివి సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆ వ్యవహారాలపై కేసులు కూడా నమోదయ్యాయి. బీజేపీ వాళ్లు కూడా వాటిని ఖండిస్తూ ప్రకటనలు చేశారు.
అలాంటి ప్రకటనలే చేస్తూ.. సినీ దర్శకుడు మణిరత్నం, చరిత్రకారుడు రామచంద్ర గుహతో సహా పలువురు మేధావి వర్గం ప్రధానికి లేఖ రాసింది. మూకదాడులను అరికట్టాలని.. అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదే దేశద్రోహం అట!
ఈ మేరకు లేఖలో సంతకాలు పెట్టిన ప్రముఖులందరి మీద దేశద్రోహం కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్ లు రాశారట పోలీసులు. బిహార్లో వీరందరి మీదా కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది. లేఖ రాసినందుకే దేశ ప్రతిష్ట తీశారంటూ.. దేశద్రోహం కేసులు పెట్టేంత స్థాయిలో ఉందనమాట దేశప్రతిష్ట!