వైసీపీలో సీబీఐ అరెస్ట్ క‌ల‌క‌లం

ఏపీ అధికార పార్టీ వైసీపీ సోష‌ల్ మీడియాలో సీబీఐ అరెస్ట్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. విశాఖ‌కు చెందిన మ‌త్తు వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్‌పై పోలీసుల దాడి, అరెస్ట్ నేప‌థ్యంలో టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు అనిత హైకోర్టులో…

ఏపీ అధికార పార్టీ వైసీపీ సోష‌ల్ మీడియాలో సీబీఐ అరెస్ట్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. విశాఖ‌కు చెందిన మ‌త్తు వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్‌పై పోలీసుల దాడి, అరెస్ట్ నేప‌థ్యంలో టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు అనిత హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్‌పై హైకోర్టు సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంలో సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ న్యాయ‌మూర్తుల‌పై సోష‌ల్ మీడియాలో కొంద‌రు అభ్యంత‌క‌ర పోస్టులు పెట్టారు.

ఇది న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై దాడిగా ప‌రిగ‌ణించిన హైకోర్టు మొద‌ట సీఐడీ విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా సుమారు 92 మందిపై సీఐడీ కేసులు న‌మోదు చేసింది. అయితే అరెస్ట్‌లు చేయ‌క‌పోవ‌డ‌మే కాకుండా కేసు ముందుకు సాగ‌క‌పోవ‌డంతో హైకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈ వ్య‌వ‌హారంపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో సీబీఐ వ‌డ‌పోత చేప‌ట్టి 18 మందిపై కేసు న‌మోదు చేసింది. వీరిలో కొంద‌రు విదేశాల్లో కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం సీబీఐ అరెస్ట్‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది.

తాజాగా క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు చెందిన లింగారెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి అనే సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్‌ను సీబీఐ అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈయ‌న ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నాడు. ఇటీవ‌ల కువైట్ నుంచి స్వ‌స్థ‌లానికి వ‌చ్చాడు. మూడు రోజుల క్రితం సీబీఐ అధికారులు విజ‌య‌వాడ‌లో ఇత‌న్ని విచారించారు. విచార‌ణ ముగియ‌డంతో ఏమీ లేద‌ని భావిస్తున్న త‌రుణంలో నిన్న సీబీఐ అధికారులు క‌డ‌ప‌కు వ‌చ్చి అత‌న్ని అరెస్ట్ చేశారు. ఈ స‌మాచారం వైసీపీ సోష‌ల్ మీడియాను ఉలికిపాటుకు గురి చేసింది.

ప్ర‌స్తుతం అత‌ను సీబీఐ క‌స్ట‌డీలో ఉన్నారు. అయితే పార్టీ కోసం సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టామ‌ని, సీబీఐ అరెస్ట్ చేస్తే క‌నీసం అధికార పార్టీ ప‌ట్టించుకోలేదంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఇక త‌మను కూడా అరెస్ట్ చేస్తార‌నే భ‌యం ప‌ట్టుకుంది. పైగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని సోష‌ల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు పోస్టులు పెట్టి, నిల‌దీయ‌సాగారు.

దీంతో వైసీపీ సోష‌ల్ మీడియా ఇన్‌చార్జి గుర్రంపాటి దేవేంద్ర‌రెడ్డి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టు క‌థేంటో చూద్దాం.

“దయచేసి ఎవ్వరూ తొందరపాటు పోస్టులు పెట్టి సమస్యని మరింత జఠిలం చేయొద్దు. లింగారెడ్డి విషయంలో పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది. న్యాయపరంగా ఏ విధమైన ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ప్రతీ కార్యకర్తను ఇలాగే కాపాడుకుంటుంది. అయితే మనకి కొన్ని పరిమితులు ఉంటాయి.. వాటి ప్రకారం అడుగులు వేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అనాలోచిత ఆవేశాలకు లోనుకాకుండా సంయమనం పాటిస్తూ అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాను” అని రాసుకొచ్చారాయ‌న‌. 

మొత్తానికి వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ అధికార పార్టీలో ఆందోళ‌న క‌లిగిస్తోంద‌నేందుకు దేవేంద్ర‌రెడ్డి పోస్టే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.