ఆన్ లైన్ లాభం.. నమ్మితే మొదటికే మోసం

ఒకప్పుడు చిట్టీల వ్యాపారంలో మోసాలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ బోర్డు తిప్పేసే చిట్టీ సంస్థలు చాలా ఉన్నాయి. ఇప్పుడీ మోసానికి అప్ గ్రేడ్ వెర్షన్ వచ్చింది. చిట్టీల విషయంలో జనాలకు అవగాహన రావడంతో, ఇప్పుడు…

ఒకప్పుడు చిట్టీల వ్యాపారంలో మోసాలు ఎక్కువగా జరిగేవి. ఇప్పటికీ బోర్డు తిప్పేసే చిట్టీ సంస్థలు చాలా ఉన్నాయి. ఇప్పుడీ మోసానికి అప్ గ్రేడ్ వెర్షన్ వచ్చింది. చిట్టీల విషయంలో జనాలకు అవగాహన రావడంతో, ఇప్పుడు ఆన్ లైన్ లో పెట్టుబడులంటూ కొత్తగా బురిడీ కొట్టించే పన్నాగాలు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఇలానే లక్షల్లో దోచేశాడు, ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు.

నెల్లూరుకు చెందిన అనీల్ వ్యక్తి హైదరాబాద్ కు మకాం మార్చాడు. బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెడితే 20శాతం లాభాలు ఇస్తానంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. ఈ మేరకు జెప్ బిట్ అనే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వచ్చిన మొత్తంలో 80శాతం ఆ ఉద్యోగికి, 20శాతం అనీల్ కు అనే ఒప్పందం కుదుర్చుకున్నారు.

అనీల్ మాటలు నమ్మి, హైదరాబాద్ కు చెందిన ఓ యువతి జెప్ బిట్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుంది. ముందుగా 8వేలు పెట్టింది. ఆమెను నమ్మించేందుకు 8వేలను 20వేలు చేసి చూపించాడు అనీల్. దీంతో యువతిలో ఆశ పుట్టింది. ఈసారి ఏకంగా అప్పుతెచ్చి మరీ 6 లక్షలు పెట్టింది. ఇదే సమయం కోసం వెయిట్ చేస్తున్న అనీల్ ఆ 6 లక్షలు కొట్టేశాడు.

యువతి పెట్టిన డబ్బు 46 లక్షలు అయినట్టు యాప్ లో చూపించింది. కానీ దాన్ని విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేకుండా చేశారు. అంటే.. పెట్టిన 6 లక్షలు పోయాయి.. కళ్లముందు కనిపిస్తున్న 46 లక్షలు మనకు రావన్నమాట. ఆ డబ్బులు చేతికి రావాలంటే మరో 4 లక్షలు పెట్టాలంటూ బేరం పెట్టారు. దీంతో యువతికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న అనీల్ ఢిల్లీకి పారిపోయాడు. అట్నుంచి అటు తన సొంత ఊరు నెల్లూరుకు వచ్చాడు. అయినప్పటికీ పోలీసులు వలపన్ని అనీల్ ను అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో జనం సొమ్ముతో అనీల్ రోజుకు 3 లక్షల రూపాయల లావాదేవీలు చేసేవాడని, కమీషన్ కింద రోజుకు 65 వేల రూపాయలు సంపాదిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అలా ఇప్పటివరకు 10 లక్షలు సంపాదించాడు.