మహాభారత కురుక్షేత్ర సమయంలో తన హితబోధతో అర్జునుడికి శ్రీకృష్ణుడు జ్ఞానోదయం కల్పిస్తారు. చేసేదెవరు? చేయించే దెవరు? అంతా తానేనని, మిగిలిన వారంతా నిమిత్త మాత్రులని శ్రీకృష్ణుడి గీతోపదేశం సారాంశం. బహుశా జగన్‌లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు శ్రీకృష్ణుడు కనిపిస్తున్నట్టున్నారు. తనకేమి జరిగినా జగనే కారణమన్నట్టు గత కొంత కాలంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతుండడం తెలిసిందే.
బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేయడానికి సంబంధించి సీబీఐ కేసు నమోదు చేయడాన్ని మరిచిపోకనే, మరో కేసు నమోదైంది. తాజాగా ఫోర్జరీ పత్రాలతో బ్యాంకుల్ని మోసగించిన నేరానికి సీబీఐ మరో కేసు నమోదైంది.
బ్యాంకులున్నది రాజుగారి కోసమో అన్నట్టుందనే సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో రూ.237.84 కోట్ల రుణం తీసుకుని మోసగించిన కేసులో రాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు వివరాలు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు మీడియా ముందుకొచ్చారు. అభూతకల్పనలు, అవాస్తవాలతో సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిందని ఆరోపించారు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే తనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ వెనుక తమ పార్టీ నేతల ఒత్తిడి ఉందంటూ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఫిర్యాదు చేసిన ఎస్‌బీఐ మేనేజర్‌కు, సీఎంవో మధ్య.. ఫోన్ కాల్స్‌పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
పలు ఛార్జిషీట్‌లు దాఖలైన సీఎం జగన్.. విచారణకు హాజరుకాకపోయినా సీబీఐ పట్టించుకోవడం లేదన్నారు. తన సంగతేదో చూసుకోకుండా ప్రతిదానికి జగన్‌తో పోల్చుకుని ఆయన మాట్లాడ్డం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమకు గిట్టని వారిపై సీబీఐతో కేసులు నమోదు చేయించే పరపతే ఉంటే …జగన్‌పై కేసులన్నీ ఎత్తి వేయించుకునే వాళ్లు కదా? ఆ మాత్రం ఆలోచన లేకుండా ఏదో ఒకటి జగన్‌పై, వైసీపీ నేతలపై బురద చల్లాలనే తాపత్రయం రాజులో కనిపిస్తోంది.
తనపై సీబీఐ కేసు నమోదు చేస్తే మాత్రం …అవాస్తవాలు, అభూతకల్పనలుగా రఘురామకృష్ణంరాజుకు కనిపిస్తున్నాయి. ఇదే జగన్‌పై నమోదు చేసిన కేసులు మాత్రం వాస్తవాలుగా కనిపించి, విచారణ ఎందుకు చేయడం లేదనే ప్రశ్నించేలా చేస్తున్నాయి.
ఇంతకూ తమరి ఆవేదన సీబీఐ కేసు నమోదు చేసినందుకా? లేక జగన్‌ను విచారించనందుకా? తిన్నంటి వాసాలను లెక్క పెట్టడం అంటే ఏంటో అనుకున్నాం కానీ…ఈయన గారిని చూస్తే దాని అర్థం ఏంటో తెలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.