కాదేదీ ప్రయోగానికి అనర్హం అని అభివృద్ధికాములు భావిస్తారు. సంప్రదాయ విద్యుత్ రోజు రోజుకీ ఖరీదు అవుతోంది. పైగా జన అవసరాలకు సరిపడా ఉత్పాదన కూదా లేకుండా పోతోంది. దాంతో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తుల కోసం పరిశోధనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో రాష్ట్రంలో సముద్ర కెరటాల నుంచి కరెంట్ ని ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్ ని విశాఖలో ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇజ్రాయిల్ కి చెందిన ఎకో వేవ్ పవర్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందాన్ని కూడా ప్రభుత్వం సిధ్ధపడుతోంది.
విశాఖ నుంచి కాకినాడి తీరం దాకా ఉన్న సముద్ర తీరంలోని కొన్ని కీలక ప్రాంతాలను అధ్యయనం చేయడమే కాకుండా అలల నుంచి కరెంట్ ని ఉత్పత్తి చేసేందుకు కూడా ఇజ్రాయిల్ సంస్థ బాధ్యతలు తీసుకుంటుంది.
అలా ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన 170 మెగావాట్ల విద్యుత్ ని జెన్కో కొనుగోలు చేస్తుంది. ఇక అలల నుంచి విద్యుత్ ని ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలలో కూడా ఉండే అవకాశాలను ఇజ్రాయిల్ సంస్థల కలసి ప్రభుత్వం పరిశీలించనుంది.
జాతీయ సముద్ర సాంకేతిక సంస్థకు ఈ అధ్యయన బాధ్యతలను ప్రభుత్వం అప్పగించనుంది. మొత్తానికి విశాఖలో ఏర్పాటు చేసే తొలి ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పాదన జరిగితే మరిన్ని ప్లాంటులు ఏపీలోని తీర ప్రాంతాల్లో వెలిసే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ కి కూడా ఇక ఢోకా ఉండబోదు.