ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కనీసం పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. ప్రభుత్వాన్ని తాము నిలదీయాల్సిన అంశాలు చాలా ఉన్నాయని.. అందుకే కనీసం పది రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందని కూడా చంద్రబాబు నాయుడు వాపోయారు. తమ పార్టీ వాళ్లతో జూమ్ మీటింగ్ నిర్వహించి చంద్రబాబు నాయుడు ఈ డిమాండ్లను చేశారు.
ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని, కొన్ని టీవీ చానళ్లకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలన్నట్టుగా ఏదో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఉన్నారు.
ఒకవైపు ప్రభుత్వం కనీసం పక్షం రోజుల పాటు సమావేశాలను నిర్వహించడం గురించి ఆలోచిస్తోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు నాయుడు పది రోజుల పాలు సమావేశాలు నిర్వహించాలని ప్రత్యేకంగా డిమాండ్ చేయడం గమనార్హం. అయితే అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశం బీఏసీ సమావేశంతో కానీ స్పష్టత రాకపోవచ్చు.
కరోనా నేపథ్యంలో సమావేశాలను కుదించినా కుదించవచ్చు. బహుశా ఆ విషయంపై స్పష్టత ఉండే.. పది రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయగల ఘనుడే. అయితే మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించినా చంద్రబాబు నాయుడు ఆ సమావేశాలకు హాజరవుతారా? అనేది చర్చనీయాంశంగానే ఉంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. చంద్రబాబు వయసు వాళ్లు ఇళ్లకు పరిమితం కావడమే పరిష్కారం అని, ఆ వయసు వారు బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆ సూచనలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి హాజరు కాకపోయినా అడిగే వారు ఉండరు. అయినా చంద్రబాబు నాయుడు పది రోజులు నిర్వహించాలంటూ డిమాండ్ చేసేస్తున్నారు.