ఏపీకి రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వాదిస్తున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు రాజధానుల ఫార్ములాను చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారు. పెద్దమనుషుల ఒప్పందం, రాయలసీమకు హై కోర్టు అనే దశాబ్దాల నాటి ఒప్పందాలను కూడా చంద్రబాబు నాయుడు ఖాతరు చేయడం లేదు. అటు ఉత్తరాంధ్రలోనూ, ఇటు రాయలసీమలోనూ తన పార్టీని అమరావతి కోసం తాకట్టుపెట్టారు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రకటించిన 48 గంటల గడువు ముగుస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే హై కోర్టు తలుపు తట్టడానికి కూడా టీడీపీ రెడీ అయిపోయింది. ఏపీ శాసనసభ ఆమోదించిన, గవర్నర్ ఆమోద ముద్ర పడిన మూడు రాజధానుల బిల్లును అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. దీనికి అమరావతి రైతుల టచ్ ఇచ్చారు. అక్కడి రియలెస్టేట్ వ్యాపారులు, భూములు కొనుగోలు చేసిన వారే రైతుల వేషం కట్టారు.
అయితే వికేంద్రీకరణ బిల్లు ప్రకారం.. అమరావతిని రాజధానిగా తొలగించడం లేదు. అమరావతి ఇప్పటికీ రాజధానే. అయితే అన్నీ అమరావతిలోనే ఉంచడం లేదు. హైకోర్టు, సచివాలయం, శాసనసభ అనేవి రాష్ట్ర ప్రజలందరి హక్కు అవుతాయి తప్ప, అమరావతి హక్కు మాత్రం కాదు. అన్నీ తమకే కావాలంటున్న అమరావతి వాసుల దురాశ న్యాయస్థానంలో కూడా నిలబడే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే, భవిష్యత్తులో ప్రాంతీయ విబేధాలు తలెత్తకుండా వికేంద్రీకరణను అమలు చేయ ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వ ప్రయత్నాలకు హైకోర్టు అయినా పై కోర్టు అయినా అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ విషయంపై చంద్రబాబుకు కూడా క్లారిటీ ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆయన ఇప్పుడు కోర్టు ప్రస్తావన తీసుకురావడం లేదని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగా నిలిచే అవకాశం లేకపోతే చంద్రబాబు నాయుడు కోర్టు నామస్మరణ చేసేవారని, హై కోర్టు పేరెత్తే వారని, అందుకు భిన్నంగా ఆయన ప్రజా కోర్టు అంటూ పొద్దుపోని మాటలు మాట్లాడుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎప్పుడైతే ప్రజా కోర్టు అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారో అప్పుడే ఆయనకు హై కోర్టులో తమ పిటిషన్ నెగ్గుతుందనే విశ్వాసం లేకుండా పోయిందని విశ్లేషకులు అంటున్నారు. చట్టబద్ధంగా అడ్డంకులను సృష్టించే అవకాశం లేదనే స్పష్టత వచ్చాకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.