తమ రాజకీయ ఉనికిని చివరకు కుల రాజకీయమే కాపాడాలని ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఆఖరికి అత్యాచార కేసుల్లో కూడా కుల రాజకీయమే సాగుతూ ఉండటం గమనార్హం. ఉదయం లేచి పేపర్ తీస్తే.. అనేక అత్యాచార కేసులు, హత్యల కేసులు వార్తల్లో ఉంటాయి. వాటిల్లో బాధితులు, నిందితులు.. అన్ని కులాల వారూ ఉంటారు.
రిక్షా తొక్కే వాడు ఇద్దరు పిల్లలను అత్యాచారం చేసిన ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అత్యాచారం, హత్యాచారాల్లో అగ్రకుల యువతులూ అనేక మంది బలి అయ్యారు. అయితే ఒక సంఘటనలో ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కులం ప్రస్తావన తీసుకువచ్చారు.
ఒక పసిపాపపై ఘాతుకం జరిగింది. తను దళితురాలు అని తెలుస్తోంది. దళిత అయినా కాకపోయినా.. జరిగినది ఘాతుకమే. దోషులపై తీవ్ర చర్యలు అవసరమే. అయితే ఈ కేసులో నిందితుడు రెడ్డి అని ప్రతిపక్ష నేత చెబుతూ ఉన్నారు. అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కొత్త చట్టం ప్రకారమే చర్యలు ఉంటాయని కూడా ప్రకటించింది.
అయితే ఒక అత్యాచారం కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడి కులం ప్రస్తావిస్తూ ఉన్నారు. బహుశా నిందితుడు ఆ కులం వాడనే చంద్రబాబు నాయుడు బాధితులను పరామర్శించినట్టుగా కూడా ఉన్నారని ఇక్కడ స్పష్టం అవుతోంది.
చంద్రబాబు నాయుడుకు ఉన్నది బాధితురాలిపై ప్రేమ కాదు, దీన్నొక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకోవడం, ఒక కులంపై విద్వేషాన్ని పెంచడం లాగుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరడం వరకూ ప్రతిపక్ష నేత బాధ్యత కావొచ్చు. కానీ.. ఇలాంటి కేసులను అడ్డం పెట్టుకుని కుల విద్వేషాలను పెంచాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉండటం గమనార్హం. పద్నాలుగేళ్ల పాటు సీఎంగా చేసిన వ్యక్తి చేయాల్సిన రాజకీయమా ఇది?