పాకిస్తాన్ మాజీ నియంత జనరల్ ఫర్వేజ్ ముషార్రఫ్ కు మరణ శిక్ష విధించింది ఆ దేశ ప్రత్యేక న్యాయస్థానం. దేశద్రోహం కేసులో ముషార్రఫ్ కు మరణ శిక్ష విధించింది స్పెషల్ కోర్టు. దాదాపు రెండు దశాబ్దాల కిందట పాక్ కు తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు ముషార్రఫ్. అప్పటి వరకూ పాక్ సైన్యాధ్యక్షుడిగా ఉండిన ఆయన, అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను పదవీచ్యుతుడిని చేసి తను అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. దేశంలో సైన్యం పాలన పెట్టాడు. తను నియంతగా మారాడు.
చాలా కాలం పాటు ముషార్రఫ్ తన అధికారాన్ని చెలాయించాడు. అయితే ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పాక్ లో సైన్యం సహకారంతో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ముషార్రఫ్ ను కేసులు చుట్టుముట్టాయి. బెనజీర్ భుట్టో హత్య కేసులోనూ ముషార్రఫ్ పేరు వినిపించింది.
పాకిస్తాన్ లో మాజీ నియంతలకు, మాజీ అధ్యక్షులు, ప్రధానిలకు జైలు శిక్షలు కొత్త ఏమీ కాదు. ఇది వరకూ కొందరు ఉరితీయబడ్డారు, మరి కొందరిని జైలుకు పంపారు, ఇంకొందరు విదేశాలకు పరార్ అయ్యారు. ఇప్పుడు ముషార్రఫ్ కూడా పాక్ లో లేరు. ఆయన దుబాయ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తను పాక్ కు ఎన్నో సేవలు చేసినట్టుగా, తనకు శిక్ష అన్యాయమని అంటున్నాడట ముషార్రఫ్.