ఓ దేశాధ్యక్షుడికి మరణశిక్ష విధించింది పాక్ ప్రభుత్వం. 1999 నుంచి 2008 వరకు పాక్ కు అధ్యక్షుడిగా వ్యవహరించిన ముషారఫ్ కు లాహోర్ కోర్టు మరణ దండన విధించింది.తీవ్రమైన దేశద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాటు.. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారనే అభియోగాలు ముషారఫ్ పై ఉన్నాయి.
సుదీర్ఘంగా ఈ కేసును విచారించిన ముగ్గురు న్యాయవాదుల బెంచ్.. ఎట్టకేలకు అతడ్ని నిందితుడిగా ప్రకటించింది.దీంతో లాహోర్ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.ఒక దేశాధ్యక్షుడికి మరణశిక్ష విధించడం పాక్ లో ఇదే రెండోసారి.గతంలో పాక్ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే.
2007 నవంబర్ 3న ఎమర్జెన్సీ విధించారు ముషారఫ్. ఆ టైమ్ లో ఆయన నిరంకుశ పాలన చేశారనేది ప్రధాన అభియోగం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అరెస్టులు చేశారని.. విపక్ష నేతలతో పాటు లాయర్లను జైళ్లో పెట్టారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి.2013లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముషారఫ్ పై విచారణ చేపట్టింది.
అదే ఏడాది తొలిసారిగా ఆయనదై తీవ్రమైన దేశద్రోహం కేసు నమోదైంది. తనపై కేసు నమోదైన తర్వాత కేవలం ఒకే ఒక్కసారి ముషారఫ్ కోర్టుకు హాజరయ్యారు.ఆ తర్వాత ఏ ఒక్క విచారణకు ఆయన హాజరుకాలేదు. పైగా, అనారోగ్య కారణాలతో 2016 మార్చిలో ఆయన దేశం విడిచి వెళ్లారు.
ఆ టైమ్ లో ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ నుంచి ఆయన పేరును తొలిగించడం పెద్ద వివాదానికి దారితీసింది. దేశద్రోహం కేసు నమోదైన వ్యక్తిని ఎలా దేశం నుంచి బయటకు వెళ్లడానికి సహకరిస్తారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి.దేశం విడిచి వెళ్లిన ముషారఫ్ అప్పట్నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు.
తాజాగా కూడా ఆయనకు నోటీసులు ఇవ్వగా.. ఓసారి దుబాయ్ వచ్చి తన ఆరోగ్య పరిస్థితిని చూడాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు ముషారఫ్. పాకిస్థాన్ కు తను చేసిన సేవల్ని గుర్తించాలని, పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇది జరిగిన కొన్నాళ్లకే ముషారఫ్ కు మరణశిక్ష ఖరారుచేస్తూ లాహోర్ కోర్టు తీర్పునిచ్చింది.అంతా బాగానే ఉంది కానీ, ముషారఫ్ ను దుబాయ్ నుంచి పాక్ కు తీసుకురావడం చాలా కష్టం.
ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం అది అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. ఓ వ్యక్తిని విచారణ కోసం అప్పగించమని అడిగితేనే దుబాయ్ చట్టాలు ఒప్పుకోవు. అలాంటిది మరణశిక్ష విధిస్తాం అప్పగించమంటే ఆ ప్రభుత్వం అస్సలు అంగీకరించదు.
ముషారఫ్ కు దుబాయ్ పౌరసత్వం కూడా లభించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకపోతే అవి నిర్థారణ కాలేదు.1965లో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో ముషారఫ్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 1971లో జరిగిన ఇండోపాక్ వార్ లో కూడా సైనిక జనరల్ గా ముషారఫ్ దే కీలక పాత్ర. సియాచిన్ వివాదం, కార్గిల్ వార్ కు ప్రధాన కారకుడు ఇతడే. 1996-2001 మధ్య ఆఫ్ఘనిస్థాన్ లో తలెత్తిన ప్రచ్ఛన్న యుద్ధం వెనక ముషారఫ్ హస్తం ఉందనేది బహిరంగ రహస్యం.ప్రస్తుతం ముషారఫ్ వయసు 76 సంవత్సరాలు.