తెలుగుదేశం పార్టీ నలభైయవ ఆవిర్భావ వేడుకల్లో కూడా పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పచ్చడే దంచారు. అదే హైదరాబాద్, అదే అభివృద్ధి, అదే పుల్లెల గోపీచంద్, అదే అంతర్జాతీయ స్థాయి.. అదే కథే!
హైదరాబాద్ అభివృద్ధిలో తనదే ముఖ్యపాత్ర అని ఇప్పటికే కొన్ని వందల, వేల సార్లు గప్ఫాలు కొట్టుకున్న చంద్రబాబు నాయుడు, మరోసారి అదే పని చేశారు. 1994లో కోకా పేటలో ఎకరం అరవై వేలు ఉండేదని, ఇప్పుడు అక్కడ అరవై కోట్ల రూపాయలు పలుకుతోందని.. అచ్చం రియలెస్టేట్ వ్యాపారి లెక్కలు చెప్పారు చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు ఒక లీడర్ కాదని, ఆయనొక డీలర్ అనే మాట చాలా మంది అంటారు. ఆయన చెప్పుకునేది కూడా అదే! పాతికేళ్లలో రియలెస్టేట్ రేట్లు మారడం తన ఘనతగా చెప్పుకోవడం చంద్రబాబుకే సాధ్యం అవుతోంది.
పాతికేళ్ల క్రితం రాయలసీమలోని మారుమూల ప్రాంతాల్లో ఎకరం భూమి పదివేలు కూడా చేసేది కాదు. అలాంటి చోట్ల కూడా ఇప్పుడు ఎకరం నలభై లక్షలు పలుకుతోందని చంద్రబాబుకు ఎవరైనా చెబుతున్నారో లేదో మరి! పల్లె, పట్టణం తేడా లేకుండా.. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఓ మోస్తరు పట్టణమో దగ్గర ఉంటే లేదా ఏదైనా రోడ్డుపక్కన పోతే.. భూముల విలువ మరే లెక్కలతో సంబంధం లేకుండా, కోటీ, అరకోటి అంటున్నారు. అలాంటిది.. కోకాపేట భూముల గురించి చంద్రబాబు తన అభివృద్ధికి నిదర్శనంగా చెప్పుకోవడానికి మించిన నిస్సిగ్గు అంశం మరోటి ఉండదేమో!
అయినా కోకాపేటలో రియల్ బూమ్ వచ్చిందప్పుడబ్బా.. 2008లో కదా! ఆ సమయంలోనే కదా.. కోకాపేట కథలు తెలుగునాట చర్చనీయాంశంగా నిలిచాయి. కోకాపేట రియల్ బూమ్ ఆధారంగా.. భూ కైలాస్ అనే కామెడీ సినిమా కూడా ఆ సమయంలోనే వచ్చింది. మరి 2008లో వచ్చిన రియల్ బూమ్, ప్రస్తుతం ఉన్నధరలనూ అన్నింటినీ తన ఖాతాలోకే వేసుకోవడం చంద్రబాబు గప్పాలు కొట్టుకోవడంలో పరాకాష్ట.