అమరావతి కోసం చంద్రబాబు నాయుడు అదేదో వెబ్ సైట్ స్టార్ట్ చేశారట. ఆ వెబ్ సైట్ ద్వారా అమరావతికి రాష్ట్ర మద్దతును సాధిస్తారట! ఆ వెబ్ సైట్లో ఓటింగులు, పోలింగ్ లు పెట్టి.. ఆంధ్రప్రదేశ్ మొత్తం అమరావతికి అనుకూలంగా ఉందని చూపిస్తారట!
ఆ వెబ్ సైట్ ను క్రియేట్ చేస్తున్న వాళ్ల ఉద్దేశమే స్పష్టం అవుతోంది. కాబట్టి..ఆ సైట్ లో వందకు వంద శాతం అమరావతికి మద్దతు వెల్లువెత్తడంలో పెద్ద ఆశ్చర్యం కూడా ఉండదు. నిజంగానే చంద్రబాబుకు ఆన్ లైన్ ద్వారా అమరావతికి మద్దతు కూడగట్టే ఉద్దేశమే ఉంటే.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి.
ఫేస్ బుక్ లో పేజీ పెట్టొచ్చు.. ట్విట్టర్లో క్యాంపెయిన్ రన్ చేయొచ్చు.. అయితే ఇలా సోషల్ మీడియాలో మద్దతు కోరితే.. అన్ని రకాల వాళ్లూ అక్కడ కామెంట్లు చేస్తారు. అప్పుడు అమరావతికి ఉన్న మద్దతు ఏపాటిదో తేటతెల్లం అవుతోంది. అందుకే సొంతంగా వెబ్ సైట్ ను ప్రారంభించేసి..అంతా అనుకూలమే అని నిరూపించేసుకునేలా ఉన్నారు.
అయినా ఉద్యమాలంటే.. వెబ్ సైట్ పెట్టి.. పోల్ నిర్వహించుకోవడం అనే దశకు తెలుగుదేశం పార్టీ వచ్చేసినట్టుగా ఉంది. 14 సంవత్సరాల పాటు సీఎం, 12 యేళ్ల ప్రతిపక్ష నేత.. అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన నినాదానికి అనుగుణంగా ప్రత్యక్షంగా ప్రజల మద్దతును చూపించలేక.. ఇలా ఆన్ లైన్ ట్యాంపరింగ్ ప్రక్రియ ద్వారా అమరావతికి మద్దతును చాటే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు.
సొంతంగా వెబ్ సైట్ పెట్టి, దాంట్లో పోల్ పెట్టించి, వందకు వంద శాతం మద్దతు చూపించుకున్నా.. ఆ పోల్ ఫలితాలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసుకోవడానికి తప్ప.. మరో ప్రయోజనం ఎంతో..చంద్రబాబుకే తెలియాలి!