మూడు రాజధానుల వ్యవహారం ససేమిరా ఇష్టంలేని చంద్రబాబు విశాఖపై విషప్రచారం చేస్తున్నారు. దీనికి ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతోంది. రోజుకో రకం సమస్యను తెరపైకి తెచ్చి విశాఖను కార్నర్ చేయడమే వీరి లక్ష్యం. ఇందులో భాగంగానే విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఎప్పటికైనా మరో బీరుట్ అవుతుందంటూ బాబు విమర్శలు చేశారు.
దీనికి మద్దతుగా పవన్ కల్యాణ్ కూడా స్పందించారు.అమ్మోనియం నైట్రేట్ నిల్వలున్న విశాఖను నిప్పుల కుంపటిగా అభివర్ణిస్తూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ కూడా తీవ్ర దుమారం రేపింది. జనాల్ని భయభ్రాంతులకు గురిచేయడానికే పవన్ నిప్పుల కుంపటి అన్న పెద్ద మాట వాడారని అనుకున్నారంతా.
అయితే ఇకపై ఈ కోణంలో విశాఖపై, ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం లేదు. అమ్మోనియం నైట్రేట్ నిల్వ రహిత నగరంగా విశాఖను మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో అమ్మోనియం నిల్వలపై కేంద్రం పూర్తి స్థాయిలో ఆరా తీసింది. భారత్ లో కేవలం విశాఖ పోర్ట్ కి మాత్రమే ఇతర దేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతోంది. ప్రతి ఏటా 2.7లక్షల మెట్రిక్ టన్నుల సరుకు విశాఖ ఓడరేవుకి వస్తోంది. స్థానికంగానే దీన్ని నిల్వ చేస్తున్నారు. ఇక్కడ్నుంచి రసాయన కర్మాగారాలకు పోగా ప్రస్తుతం 19500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ విశాఖలోని గోదాముల్లో నిల్వ ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమ్మోనియం నైట్రేట్ నిల్వ రహిత నగరంగా విశాఖను మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే నౌకల్లో వస్తున్న అమ్మోనియం నైట్రేట్ ను దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు విధించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దిగుమతులు ఆపేయాలని అధికారులు ఆదేశించారు. గోదాముల్లో ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలను 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని వాటి కొనుగోలుదారులకు కూడా వర్తమానం పంపారు.
మొత్తమ్మీద ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్టు విశాఖపై నిప్పుల కుంపటి ఉండబోదన్నమాట. అంటే ఇకపై అమ్మోనియం నైట్రేట్ పేరు చెప్పి విశాఖపై దుష్ప్రచారం ఎవరూ చేయలేరు.