ఈ ఏడాది మిగిలిన ఆరు నెలల్లో అధికారికంగా ఏ రాష్ట్రంలోనూ సార్వత్రిక ఎన్నికలు లేవు. లెక్క ప్రకారం వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
స్థూలంగా ఈ ఏడాది మాత్రమే కాకుండా, వచ్చే ఏడాది మార్చి వరకూ అధికారికంగా రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఏదీ ఉండదు. ఎలాగూ ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఇప్పుడప్పుడే ఎక్కడా ఉప ఎన్నికలు కూడా ఉండవు.
వచ్చే ఏడాది మార్చిలో పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించుకుంది. అయితే.. ఇక ఎవరూ ఏదీ ప్లాన్ చేసేదేమీ ఉండదు, అన్నీ కరోనా తదుపరి వేవ్ లు ప్లాన్ చేస్తాయని బహిరంగ సత్యం.
ఒకవేళ కరోనా మరో వేవ్ లో రకపోతే ఫర్వాలేదు. వస్తే.. ఎవ్వరి చేతిలోనూ ఏమీ ఉండదు. ఇప్పటికే కరోనా విజృంభణకు ప్రధాన కారణాల్లో ఎన్నికలు ముఖ్యమైనవి అని స్పష్టం అవుతూనే ఉంది.
వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికలు.. వంటివి కరోనా కేసులను భారీ స్థాయికి తీసుకెళ్లడానికి కారణాల్లో ఒకటయ్యాయని స్పష్టం అవుతోంది. మద్రాస్ హై కోర్టు ఈ విషయంలో తీవ్రంగా స్పందించింది కూడా.
తమిళనాట కరోనా విజృంభణకు ఎన్నికల కమిషన్ ది కూడా బాధ్యతంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితి ఉన్నా.. ఎన్నికలు నిర్వహిచడం తమ కర్తవ్యమంటూ సీఈసీ మరోసారి స్పష్టం చేశారు. అయితే అయ్యుండొచ్చు.. కానీ తమరి కర్తవ్య నిర్వహణ అంటూ.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడానికి హక్కేముందో!
కర్తవ్యం అంటూ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వ్యవహరించడం తీవ్రమైన పరిణామాలకు కారణం అవుతూ ఉంది. కనీసం ముందు ముందు జరగాల్సిన ఎన్నికల విషయంలో అయినా.. ఎన్నికల కమిషన్ కరోనా ను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. రాజకీయ పార్టీలకు కావాల్సింది ఎన్నికలే. కాబట్టి వాటి నిర్వహణకు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా సై అంటాయి.
వాటి రాజకీయ స్వార్థానికి చివరకు దేశం మొత్తం ఫలితాలను అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయినా.. వచ్చే ఏడాది షెడ్యూల్ గురించి సీఈసీ గారు ఇప్పుడే స్పందించేయడం అతి అయ్యిందేమో! ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఎన్నికలు కాదు, కరోనా వ్యాక్సినేషన్. పాలకులు అది గుర్తిస్తే మంచిది. మిగతా వ్యవస్థలు ప్రజల అవసరాలకు తమ వంతు సహకరించాలి కానీ, ఇక వేరే మాటలు ఎవరికీ అవసరం లేదు.