ప్రధాని మోదీ నిర్ణయంతో పరోక్షంగా జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలకు రద్దు చేస్తూ ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా సెకెండ్‌వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వివిధ భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం కూడా పరీక్షల రద్దుకు ఒక కారణమని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ప్రకటించింది.
బోర్డు పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్య, పాఠశాల విద్య కార్యదర్శులు, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అనేక అంశాలపై చర్చించిన తర్వాత సీబీఎస్ఈ పరీక్షల రద్దుకే ప్రధాని మొగ్గు చూపారు. అయితే విద్యార్థులకు మరో ఆప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం గమనార్హం.
మార్కుల విషయంలో అసంతృప్తిగా ఉండే విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని.. అయితే, కరోనా పరిస్థితులు మెరుగయ్యాకే పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్షల రద్దు నిర్ణయం అనంతరం ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను పరిశీలిద్దాం.
‘కొవిడ్ 19తో విద్యా సంవత్సరం తీవ్రంగా ప్రభావితమైంది. బోర్డు పరీక్షల అంశం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో తీవ్ర ఒత్తిడికి కారణమవుతోంది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, వారి భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యం. అందుకే పరీక్షలను రద్దు చేశాం’ అని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అయితే పరీక్షల నిర్వహణకే జగన్ సర్కార్ మొగ్గు చూపుతోంది.
ఇందులో భాగంగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ను వాయిదా వేస్తూ… కరోనా కంట్రోల్ కాగానే నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సీబీఎస్ఈ పరీక్షలనే రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో సహజంగానే జగన్ సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ ఏపీ సర్కార్‌కు పట్టదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
సీబీఎస్ఈ పరీక్షలనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పుడు, జగన్ సర్కార్‌కు ఎందుకంత పట్టింపు అనే నిలదీతలు స్టార్ట్ అయ్యాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతామని ఇంకా మొండి పట్టుదలతో ముందుకెళుతుందా లేక కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తితో సరైన నిర్ణయం తీసుకుంటుందా? అనేది తేలాల్సి వుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మాత్రం జగన్ సర్కార్‌ను ఇరకాటంలో పడేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.