ఆయుర్వేదం మందు విషయంలో తయారీదారులకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. వాటిలో వాడాల్సిన మందుల మోతాదు, తయారు చేసే ప్రదేశం, తయారీ సమయం.. ఇలాంటి వాటిలో ఆ సెంటిమెంట్లను కొనసాగిస్తుంటారు. ఆనందయ్య ఆయుర్వేద మందు విషయంలో కూడా ఆయనకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి.
తన సొంత గ్రామం కృష్ణపట్నంలోనే ఆయుర్వేద మందు తయారు చేస్తానని గతంలో పలుమార్లు అధికారులు, నాయకులకు చెప్పారు ఆనందయ్య. ఈ క్రమంలోనే ఆయన ఇంటి నుంచి ఇన్నాళ్లూ దూరంగా ఉన్నా కూడా మందు తయారీ జోలికి వెళ్లలేదు. రాజకీయ నాయకులు రికమండేషన్లు చేసినా.. తన సొంత ఊరిలో చేసి ఇస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని అధికారులు పక్కనపెట్టారు.
కృష్ణపట్నం గ్రామంలో కొవిడ్ నిబంధనలు పాటించి మందు పంపిణీ చేయడం అసాధ్యం. పోలీసు బందోబస్తు పెంచినా కూడా కుదరదని గత అనుభవాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ అనుమతితో ఇప్పుడు ఆనందయ్య పంపిణీ చేసే మందుని కృష్ణపట్నం నుంచి కాకుండా, పోర్ట్ ఏరియాలో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటి వరకు ఆనందయ్యను ఉంచిన కృష్ణపట్నం పోర్ట్ గెస్ట్ హౌస్ పరిధిలోని సెక్యూరిటీ అకాడమీలో మందు తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణపట్నం గ్రామంలో మందు పంపిణీకి అనుమతి ఇస్తే, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయాల్సి వస్తుందని, పోలీసు బలగాలు గ్రామాన్ని చుట్టుముడితే స్థానికులకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు.
అయితే మందు పంపిణీకి ప్రభుత్వ అనుమతి రాగానే కృష్ణపట్నం గ్రామంలోని ఆనందయ్య మామిడి తోట వద్ద టెంట్లు వేసి, బ్యారికేడ్లు కట్టి ఏర్పాట్లు మొదలు పెట్టారు. ముడిసరకులు, ఇతర సామగ్రి తెప్పించుకున్నారు. అధికారులు ఇప్పుడు నిర్ణయం మార్చుకోవడంతో బ్యారికేడ్లు, టెంట్లు తొలగించేశారు. భద్రతతో పాటు, పంపిణీ సక్రమంగా జరగాలి కాబట్టి పోర్ట్ లోని సెక్యూరిటీ అకాడమీ సురక్షితమైన ప్రాంతమని అధికారులు భావిస్తున్నారు.
కరోనా రోగులు రాకుండా వారి సంబంధీకులు మాత్రమే మందు తీసుకోడానికి రావాలని ఇప్పటికే సూచించారు. ఆన్ లైన్ ద్వారా మందు పంపిణీ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.