2020 రౌండప్: తారల పెళ్లి సందడి

సినిమాల పరంగా 2020 అంత బ్యాడ్ ఇయర్ ఇంకోటి లేదనే చెప్పాలి. కానీ పెళ్లిళ్ల పరంగా 2020 ఇయర్ మాత్రం హీరోహీరోయిన్లకు బాగా కలిసొచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన రానా నుంచి…

సినిమాల పరంగా 2020 అంత బ్యాడ్ ఇయర్ ఇంకోటి లేదనే చెప్పాలి. కానీ పెళ్లిళ్ల పరంగా 2020 ఇయర్ మాత్రం హీరోహీరోయిన్లకు బాగా కలిసొచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన రానా నుంచి స్టార్ హీరోయిన్ కాజల్ వరకు చాలామంది  ఈ ఏడాది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ లిస్ట్ లో కొన్ని సర్ ప్రైజ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి.

కొన్నేళ్ల కిందటే పెళ్లి చేసుకోవాల్సిన రానా, ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా రహస్యంగా మిహికా బజాజ్ ను ప్రేమించిన ఈ నటుడు, లాక్ డౌన్ టైమ్ లో ఆ విషయాన్ని బయటపెట్టడంతో పాటు, లాక్ డౌన్ టైమ్ లోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. అలా తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ లైన్ ను వదిలించుకున్నాడు ఈ దగ్గుబాటి వారసుడు.

హీరోలు నితిన్, నిఖిల్ కూడా ఈ ఏడాదే తమ గర్ల్ ఫ్రెండ్స్ ను ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నారు. నితిన్-షాలిని ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు. అటు నిఖిల్ కూడా సడెన్ గా తన ప్రేయసి పల్లవిని పరిచయం చేశాడు. నిఖిల్ ప్రేమలో పడ్డాడంటూ ఓవైపు న్యూస్ వైరల్ అవుతున్న టైమ్ లో ఏకంగా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. ఈ ఏడాది పల్లవి వర్మ మెడలో మూడుముళ్లు వేశాడు.

స్టార్ హీరోయిన్ కాజల్ కూడా తన పెళ్లిపై కొన్నేళ్లుగా వస్తున్న రూమర్లకు ఈ ఏడాదితో ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును ప్రేమిస్తున్నట్టు చెప్పడమే కాకుండా.. అదే టైమ్ లో పెళ్లి కబురు కూడా మోసుకొచ్చింది. వీళ్లిద్దరి పెళ్లి-హనీమూన్ ఫొటోలు ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక ఈ ఏడాది గ్రాండ్ వెడ్డింగ్స్ లో ఒకటి నిహారిక పెళ్లి. మెగా ఫ్యామిలీ మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పెళ్లిని ఆర్భాటంగా జరిపించారు. ఉదయ్ పూర్ లోని ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ లో నిహారిక-చైతన్య పెళ్లి 3 రోజుల పాటు అట్టహాసంగా జరిగింది. లాక్ డౌన్ తర్వాత గ్రాండ్ గా జరిగిన పెళ్లి ఇదే.

ఇక ఈ ఏడాది సర్ ప్రైజ్ వెడ్డింగ్స్ లో ఒకటి దిల్ రాజు రెండో పెళ్లి. మూడేళ్ల కిందట భార్యను పోగొట్టుకున్న ఈ నిర్మాత, ఈ ఏడాది మే నెలలో తేజశ్విని అలియాస్ వైఘారెడ్డిని వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఓ గుడిలో సింపుల్ గా వీళ్ల వివాహం గుంభనంగా జరిగింది.

ఇలాంటిదే మరో సర్ ప్రైజింగ్ కపుల్ సింగర్ సునీత్, రామ్. ఇన్నేళ్లూ సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని చూసుకున్న సునీత, ఇప్పుడు మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. మ్యాంగో రామ్, సునీత నిశ్చితార్థం పూర్తయింది. వచ్చే నెలలో పెళ్లి. ఈ ఏడాది పెళ్లి చేసుకున్న నటుల్లో రంగస్థలం మహేష్ కూడా ఉన్నాడు. తనకు తెలిసిన పావని అనే అమ్మాయిని మహేష్ పెళ్లాడాడు.

అయితే పెళ్లి చేసుకుంటారని అంతా భావించిన కొన్ని జంటలు మాత్రం ఈ ఏడాదిని మిస్ కొట్టాయి. వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సిన జంట నయనతార-విఘ్నేష్ శివన్. నయన్-విఘ్నేష్ జంట ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకోలేదు. కనీసం ఎంగేజ్ మెంట్ ముచ్చట కూడా జరగలేదు. అటు గుత్తాజ్వాల-విష్ణువిశాల్ మాత్రం ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మరోవైపు హీరోయిన్ అవికా గౌర్ కూడా ఈ ఏడాదే తన ప్రేమను బయటపెట్టింది. 

అధికార పార్టీలో అదే చర్చ