మానవాళిని పెను సంక్షోభంలోకి నెట్టిన కోవిడ్-19 వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రించడం గురించి కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచిన ఒక కమిటీ తన అంచనాలను, అభిప్రాయాలను పేర్కొంది.
ఐఐటీ ప్రొఫెసర్లు, ఇతర నిపుణులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ దేశంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ చూపించిన ప్రభావం గురించి, ఇకపై కోవిడ్-19 ప్రభావం ఎలా ఉంటుందనే అంశం గురించి విశ్లేషించింది. ఆ విశ్లేషణల్లో ప్రధానమైన అంశం ఏమిటంటే.. ఇండియాలో కోవిడ్-19 పీక్ స్టేజ్ ముగిసింది అనేది.
గత కొన్నాళ్లుగా భారతదేశంలో కరోనా డైలీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజువారీగా 60 వేల స్థాయిలో కేసులు నమోదవుతూ ఉన్నాయి. రికవరీల సంఖ్య కొత్త కేసుల కన్నా కనీసం పది నుంచి 15 వేల వరకూ ఎక్కువగా ఉంటూ ఉంది. దీంతో యాక్టివ్ కేసుల లోడ్ తగ్గుముఖం పడుతూ ఉంది. ఒక దశలో 11 లక్షల వరకూ చేరిన యాక్టివ్ కేసుల లోడ్ ప్రస్తుతం ఎనిమిది లక్షల లోపు స్థాయికి చేరింది.
అయితే త్వరలోనే ఇండియాలోనే పండగల సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో భారీ గ్యాదరింగులు ఉండనే ఉంటాయి. ప్రభుత్వాలు పూర్తిగా పగ్గాలు వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పండగల సీజన్ లో జాగ్రత్తగా ఉండాలని, అలాగే శీతాకాలంలో కోవిడ్-19 విజృంభించే అవకాశం ఉందని నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
ఈ హెచ్చరికలను ప్రజానీకం ఏ మేరకు లెక్క చేస్తుందో కానీ.. జాగ్రత్తలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ స్పష్టం చేసింది. జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్-19 ను నియంత్రించడం సాధ్యం అవుతుందని పేర్కొంది.
ప్రస్తుతం ప్రజల దినవారీ యాక్టివిటీస్ దాదాపుగా పగ్గాలెక్కాయి. ఈ నేపథ్యంలో కూడా కొత్త కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతూ ఉండటం ఊరటను ఇచ్చే అంశం. ఇలాగే ప్రజలు జాగ్రత్తగా ఉంటే… వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ కమిటీ విశ్లేషించింది.
కేసుల సంఖ్య ఇలాగే తగ్గుముఖం పట్టినా కరోనా ను పూర్తిగా నియంత్రించడానికి మాత్రం 2021 ఫిబ్రవరి వరకూ సమయం పడుతుందని ఈ కమిటీ పేర్కొంది. అంత వరకూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.