దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏ రోజుకారోజు పెరిగిపోతూ ఉంది. దినవారీ గణాంకాలు ఎప్పటికిప్పుడు కొత్త హై రేంజ్ కు చేరుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11 లక్షలను దాటి పోయాయి. ఏ రోజుకారోజు పెరిగిపోతున్న నంబర్లతో సామాన్య ప్రజలు కూడా హడలిపోతున్నారు. సాధారణ జలుబు, జ్వరం వచ్చినా.. కరోనానేమో అని అనుమానపడుతున్నారంతా. ఈ అనుమానాలతో కొందరు టెన్షన్ పడుతున్నారు. దీని వల్ల పలు రకాల పర్యవసనాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
దేశంలో కరోనా కేసులు పది లక్షల పై స్థాయికి చేరిపోయాయని భయపడాల్సిన అవసరం లేదని, ఆ 11 లక్షల మందిలో ఏడు లక్షల మందికి పైగా కోలుకుని డిశ్చార్జి అయిన విషయాన్ని గుర్తించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ -19 యాక్టివ్ కేసుల సంఖ్య 4,02,529 అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 7,24,577 మంది ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన విషయాన్ని ప్రజలు గుర్తించాలని కేంద్రం చెబుతోంది.
అలాగే కరోనా మరణాల రేటు కూడా ఇండియాలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు తక్కువని కేంద్రం స్పష్టం చేస్తోంది. కోవిడ్ -19 సోకిన వారిలో మరణాల రేటు 2.43 అని కేంద్రం చెబుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినా, ప్రపంచ సగటుతో పోల్చినా భారత్ అత్యంత మెరుగైన స్థితిలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు కోవిడ్-19 సోకిన వారిలో మరణాల శాతం ఏడు వరకూ ఉందని, ఇండియాలో 2.43 అంటే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం వల్లే అని గుర్తించాలని పేర్కొంది. కొన్ని దేశాల్లో అయితే ఈ సగటు అనేక రెట్లు ఎక్కువ ఉందని కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం దేశంలో ప్రతి పది లక్షల జనాభాకూ 837 మందికి కరోనా సోకినట్టుగ గణాంకాలు చెబుతున్నాయి. ఇతర దేశాల జనాభా, వాటి కరోనా కేసుల సంఖ్య ప్రకారం చూసుకున్నా భారత్ మెరుగైన పరిస్థితుల్లో ఉందట. అలాగే పరీక్షల విషయంలో కూడా భారత దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన నంబర్ల కన్నా ఎక్కువ టెస్టులనే చేస్తోందని కేంద్రం స్పష్టం చేస్తోంది. నాలుగు లక్షల స్థాయిలోనే యాక్టివ్ కేసులు ఉండటంతో దేశంలోని కోవిడ్ -19 ఆసుపత్రులపై కూడా లోడ్ తక్కువగా ఉన్నట్టే అని కేంద్రం అంటోంది.
కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఈ మాటలు అయితే బాగానే ఉన్నాయి కానీ, ప్రతి రోజూ డిశ్చార్జి కేసుల సంఖ్య కన్నా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమం తప్పకుండా ఎక్కువగా ఉంటోంది. అలాగే రోజువారీగా ఐదు వందలకు మించిన స్థాయిలో కోవిడ్ -19 మరణాలు నమోదు అవుతుండటం మాత్రం విచారకరం.