రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు రైల్వే మంత్రి జవాబు
సౌత్ కోస్టల్ రైల్వే అధికారి సమర్పించే సవివరమైన ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను సమర్పించిన తర్వాతే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంపై సంబంధిత ప్రాధికార ప్రకటన చేస్తారని రైల్వే మంత్రి శ్రీ పియూష్ గోయల్ శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ ఏర్పాటుకు ఆవసరమైన ప్రణాళిక, కార్యాచరణను రూపొందించేందుకు సౌత్ కోస్టల్ రైల్వేకి ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు మంత్రి తెలిపారు.
కొత్తగా ప్రతిపాదించిన రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలంటూ కొన్ని వర్గాల నుంచి వినతులు వచ్చినట్లుగా మంత్రి చెప్పారు. అయితే పరిపాలన, కార్యనిర్వహణకు అనువైన అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న మీదటే నిర్దేశిత పరిధిలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
వాల్తేరు డివిజన్ లేనట్లే…
జోన్ ప్రధాన కార్యాలయం ఉన్న చోటే డివిజన్ ప్రధాన కార్యాలయం కూడా ఒక చోటే ఉండాలన్న సంప్రదాయం ఏదీ లేదని మరో ప్రశ్నకు జవాబుగా మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఉదాహరణకు నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (మాలిగావ్), సౌత్ ఈస్ట్రన్ రైల్వే (కోల్‌కతా), ఈస్ట్ కోస్టల్ రైల్వే (భువనేశ్వర్), నార్త్ ఈస్ట్రన్ రైల్వే (గోరఖ్‌పూర్), ఈస్ట్ సెంట్రల్ రైల్వే (హాజిపూర్) జోన్లకు డివిజనల్ హెడ్ క్వార్టర్స్ లేవని అన్నారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అవసరం లేదు..
భారతీయ రైల్వేలు దేశమంతటా విస్తరించిన వ్యవస్థ కలిగినటువంటిది. జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ విభాగాల్లో గ్రూప్ సీ కింద వివిధ కేటగిరీలలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ బోర్డులను రాష్ట్రాలు, ప్రాంతాలు లేదా జోన్ల ప్రాతిపదికపైన కాకుండా రైల్వే పరిధిని మాత్రమే ప్రాతిపదికగా చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఆర్బీలు చేసే ఉద్యోగ ప్రకటనలకు దేశంలోని ఏ ప్రాంతంవారైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. రాష్ట్రం, ప్రాంతం, స్థానికత, కులం, మతం వివక్షకు తావివ్వకుండా ఈ బోర్డులు రిక్రూట్మెంట్ నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు.