హతవిధీ.. ఎంపీలు లేని భావి ప్రధాని!

2019 ఎన్నికలకు ముందు ముఖచిత్రం. యూపీఏ కూటమి బీజేపీని ఓడిస్తుందని బాబు జోస్యం చెప్పారు, తనకు తాను యూపీఏ స్వయంప్రకటిత కన్వీనర్ గా మారిపోయి రాష్ట్రాలన్నీ చుట్టొచ్చారు. అన్ని పార్టీల నేతల్ని ఏపీలో తీసుకొచ్చి…

2019 ఎన్నికలకు ముందు ముఖచిత్రం. యూపీఏ కూటమి బీజేపీని ఓడిస్తుందని బాబు జోస్యం చెప్పారు, తనకు తాను యూపీఏ స్వయంప్రకటిత కన్వీనర్ గా మారిపోయి రాష్ట్రాలన్నీ చుట్టొచ్చారు. అన్ని పార్టీల నేతల్ని ఏపీలో తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్నారు. కేంద్రంలో తనకున్న బలం, బలగం అదీ అంటూ విర్రవీగారు. కాలం కలిసొస్తే.. యూపీఏకీ మెజార్టీ వచ్చి, కాంగ్రెస్ స్కోర్ తగ్గితే సమన్వయ కర్తగా తాను ప్రధాని పోస్ట్ దక్కించుకోవచ్చని కోతలు కోశారు. అది కుదరకపోతే ఏపీలోని 25ఎంపీ స్థానాలు గెల్చుకుని కేంద్రంలో చక్రం తిప్పొచ్చని అంచనా వేశారు.

కానీ బాబు ఒకటి తలిస్తే, ప్రజలు ఇంకోటి తలచారు. ఫలితాలు తర్వాత బాబు ముఖచిత్రం మారిపోయింది. బాబుకి కర్రుకాల్చి వాతపెట్టారు ఏపీ ప్రజలు. ఆ అవమాన భారంతో అసెంబ్లీలో ఓ మూల కూర్చున్న చంద్రబాబుకి రాజ్యసభ ఎంపీలు ఫస్ట్ ఝలక్ ఇచ్చారు. ఏకంగా టీడీపీ రాజ్యసభాపక్షాన్నే బీజీపీలో విలీనం చేశారు. మిగిలిన ఇద్దరు, లోక్ సభలో ఉన్న ముగ్గురు కూడా అమిత్ షాతో బేరం మాట్లాడుకుంటున్నారు.

చూశారుగా ఇంతలోనే ఎంత మార్పు. ప్రధాని పదవికే పోటీపడ్డానని చెప్పుకున్న వ్యక్తి, కేంద్రంలో చక్రం తిప్పుతానన్న వ్యక్తి.. చివరకు తన సైకిల్ చక్రమే తిప్పలేక చతికిలపడ్డారు. చేతిలో ఉన్న అరకొర ఎంపీలు కూడా జారిపోతున్న పరిస్థితికి వచ్చారు. ఇదంతా బాబు ఓవర్ యాక్షన్ ఫలితమే.

ఏపీ ప్రత్యేకహోదా కోసం బీజేపీతో విభేదించి ఉంటే ఏ సమస్యా ఉండేదికాదు, ఏకంగా బీజేపీని గద్దెదించేస్తామని, మోడీ ప్రధానిగా పనికిరారంటూ ఓ రేంజ్ లో పైర్ అయిన చంద్రబాబు పార్టీకి ఇప్పుడు పార్లమెంట్ లో అడ్రస్ గల్లంతు అవుతుందంటే అది ఆయన స్వయంకృతాపరాధమే.

సొంత పార్టీలోని ప్రత్యర్థులనే చాకచక్యంగా పక్కకి తప్పించిన ఘనత మోదీ, షా ద్వయానిది. అలాంటి ఈ బ్యాచ్.. ఎగిరెగిరి పడ్డ బాబుని ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఫలితాలొచ్చాక కీలెరిగి వాత పెట్టింది. ప్రధాని, ప్రధాని అని ఎగిరిన బాబుకి.. అసలు ఢిల్లీకి వచ్చే అవసరం, అవకాశం లేకుండా చేస్తున్నారు బీజేపీ నేతలు.

ఇక చంద్రబాబు ఇతర రాష్ట్రాల నేతల ముందు తలెత్తుకుని ఎలా తిరుగుతారు? ఎప్పుడు ఎన్నికలొచ్చినా తను ప్రధాని అభ్యర్థినంటూ సొంత మీడియాతో సొంత డబ్బా కొట్టించుకునే బాబు, ఈసారి ఎంపీలు లేని భావిప్రధానిగా మిగిలారు.

టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!