రాజకీయాల్లోనైనా, నిజ జీవితంలోనైనా చాలామంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మనం చేసింది తిరిగి మనకే వస్తుందంటుంటారు. ఎవరి విషయంలో ఎలా జరుగుతుందో చెప్పలేం కానీ, చంద్రబాబు విషయంలో మాత్రం ఈ కర్మ సిద్దాంతం తూచ తప్పకుండా తన పని తాను చేసుకుపోతోంది. గతంలో బాబు చేసిన తప్పులకు ప్రతిఫలాల్ని దశల వారీగా గంపగుత్తగా అందించేస్తోంది కర్మ.
మొదటి కర్మ ఫలితం 2019లోనే..
తను చేసిన తప్పులకు 2019లోనే శిక్ష అనుభవించారు చంద్రబాబు. అరాచక, నిరంకుశ పాలనకు ప్రతిఫలంగా ఘోర పరాజయాన్ని చవిచూశారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొన్న చంద్రబాబుకు.. గత ఎన్నికల్లో అవే 23 సీట్లు మిగిలాయి. కర్మఫలితానికి ఇంతకంటే పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదేమో.
ఇప్పుడా 23 అనే నంబర్ ను కూడా బాబు గట్టిగా బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే, ఆల్రెడీ నలుగురు జారిపోయారు. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఆ గట్టుకు చేరుతారో అంచనా వేయడం బాబు వల్ల కావడం లేదు. ఇది కూడా కర్మ ఫలితమే. గతంలో వైసీపీ నుంచి వలసల్ని ప్రోత్సహించిన చంద్రబాబు.. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.
ఇక ఇప్పుడు రెండో విడత
అయితే ఇదంతా గతం. రెండేళ్ల కిందట జరిగిపోయిన విషయం. ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం. కానీ కర్మ ఇలా విడిచిపెట్టదు కదా. గతంలో బాబు చేసిన తప్పుల్ని ఇప్పుడు రెండో విడతలో తిరిగి బాబుకే రివర్స్ లో అందించబోతోంది. ముఖ్యమంత్రిగా చేసిన తప్పులకు 2019లోనే శిక్ష అనుభవించిన చంద్రబాబు.. పార్టీ అధినాయకుడిగా చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పార్టీని పూర్తిగా పక్కనపెట్టారు బాబు. మరీ ముఖ్యంగా కొడుకు లోకేష్ ను హైలెట్ చేసేందుకు, ద్వితీయశ్రేణి నాయకుల్ని ఎదగకుండా చేశారు. ఆ తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు, ట్విట్టర్ లో కాలక్షేపం చేస్తుండగా.. టీడీపీలో ఇప్పుడు రెండో తరం నేతలు కరువయ్యారు.
ఉదాహరణకు విశాఖ సెగ్మెంట్ నే తీసుకుంటే, సౌత్ నుంచి వాసుపల్లి గణేశ్ వైసీపీలో చేరారు. అక్కడ మరో ఇంచార్జిని నియమించే పరిస్థితి లేదు. ఇక నార్త్ నుంచి గంటా రాజీనామా చేశారు. ఆయన తప్పుకుంటే అక్కడ మరో నేత లేడు. భీమిలిలో ఈ రోజుకీ టీడీపీకి గట్టి లీడర్ లేడు. ఇది కేవలం విశాఖ పరిస్థితి మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ స్థితి ఇదే.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి 3 సెగ్మెంట్లలో ఒక చోట ద్వితీయ శ్రేణి నాయకత్వ లోపం పసుపు పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనికి కారణం చంద్రబాబు నాయకత్వ వైఫల్యం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమైన చంద్రబాబు.. పార్టీ అధ్యక్షుడిగా కూడా ఫెయిలైన విషయం ఇప్పుడు కర్మ రూపంలో మరోసారి ఇలా బయటపడుతూ ఉంది. వచ్చే ఎన్నికల నాటికి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని వెదుక్కునే దీన స్థితికి టీడీపీ వచ్చిందంటే దానికి కారణం, గతంలో చంద్రబాబు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్ని అణగదొక్కడమే.
మూడో విడత కర్మఫలానికి బాబు సిద్ధమా..?
చంద్రబాబు విషయంలో కర్మ ఫలితం ఇంకా పూర్తవ్వలేదు. కర్మ పార్ట్-3 రెడీగా ఉందంటున్నారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రిగా అధికారాన్ని చలాయించినప్పుడు చేసిన కుంభకోణాలకు, ఆర్థిక నేరాలకు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని చెబుతున్నారు.
ఈ విషయంలో బాబు ప్రస్తుతానికి తప్పించుకోవచ్చని, భవిష్యత్తులో మాత్రం బాబు తప్పకుండా అనుభవిస్తారని చెబుతున్నారు.