టీడీపీ అధినేత చంద్రబాబుకు కాకినాడు కార్పొరేటర్లు గట్టి షాక్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక…టీడీపీలో అంతర్గత విభేదాలను వీధిన పడేసింది. ఈ నెల 4న డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీకి చెందిన 21 మంది కార్పొరేటర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. దీంతో పార్టీ అధినేతకు ఝలక్ ఇచ్చినట్టైంది.
హైకోర్టు ఆదేశాల మేరకు 2017లో కాకినాడు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. నాటి అధికార పార్టీ టీడీపీ కాకినాడు కార్పొరేషన్ దక్కించుకుంది. అక్కడ టీడీపీకి 32, వైసీపీకి 10, బీజేపీ ముగ్గురు చొప్పున సభ్యులను కలిగి ఉన్నాయి. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్లో టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఏపీలో 2019లో అధికార మార్పిడి జరిగింది. కాకినాడ నగర ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గెలుపొందారు.
అనంతరం కాకినాడు నగరపాలక సంస్థలో రాజకీయాలు మారుతూ వచ్చాయి. టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. అంతేకాదు, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మేయర్ సుంకర పావని వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఇది టీడీపీని మరింత బలహీనపరుస్తోంది. దీంతో టీడీపీ మెజార్టీ కార్పొరేటర్లు గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లలో విభేదాలు పతాకస్థాయికి చేరాయి.
తాజాగా రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక ముంగిట కాకినాడ కార్పొరేషన్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 21 మంది టీడీపీ కార్పొరేటర్లు తమను స్వతంత్రులుగా గుర్తించాలని కోరుతూ కార్పొరేషన్ కమిషనర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి లేఖలను అందజేశారు. మరోవైపు తమకు సంఖ్యా బలం ఉందని, కావున రెండో డిప్యూటీ మేయర్ బరిలోకి దిగుతామని టీడీపీ చెబుతోంది. తమ సభ్యులకు విప్ జారీ చేస్తామని, కట్టుతప్పితే వేటు వేస్తామని టీడీపీ హెచ్చరిస్తోంది.
అయితే టీడీపీ తిరుగుబాటు కార్పొరేటర్ల వాదన మరో రకంగా ఉంది. తాము ఎప్పటి నుంచో టీడీపీకి దూరంగా ఉన్నామని, పార్టీ సభ్యత్వాన్ని కూడా తీసుకోలేదంటూ లేఖలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. డిప్యూటీ మేయర్ ఎన్నికకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇరుపార్టీల ఎత్తులుపైఎత్తులతో కాకినాడు రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు వైసీపీ మాత్రం తమకు 23 మంది సభ్యుల బలం ఉందని , రెండో డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకుంటామని చెబుతోంది.