“ఇక్కడెవరో నన్ను పూల చొక్కా అన్నారు, అర్జంట్ గా లెక్చరర్ నాకు సారీ చెప్పాలి.” అప్పట్లో ఓ సినిమాలో సునీల్ చేసిన కామెడీ ఇది. ఎవరో ఏదో అంటే లెక్చరర్ ను క్షమాపణ కోరుతాడు సునీల్. ఇప్పుడు చంద్రబాబు వ్యవహారశైలి కూడా ఇలానే ఉంది.
బాబు కూడా అప్పుడప్పుడు ఇలాంటి కామెడీయే చేస్తుంటారు. సమస్యలకు సంబంధం లేని పరిష్కార మార్గాలు వెదుకుతుంటారు. రాజీనామాలు చేయండి అంటూ కొత్త డిమాండ్లని తెరపైకి తెస్తుంటారు. తాజాగా మరోసారి అలాంటి సిల్లీ డిమాండ్ తో చిరాకు తెప్పిస్తున్నారు చంద్రబాబు.
పార్లమెంట్ లో వైసీపీ మైలేజీ తగ్గించేందుకే..
పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు హడలెత్తిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు వెల్ లోకి దీసుకెళ్లి మరీ సమస్యను అందరి దృష్టికీ తీసుకొచ్చారు. ఈ దశలో టీడీపీకి పూర్తిగా మైలేజీ తగ్గింది, అటు వైసీపీ ఎంపీలు హీరోలవుతున్నారు. ఏం చేయాలో తెలీక అందరం రాజీనామాలు చేద్దామంటున్నారు చంద్రబాబు.
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా అందరం రాజీనామాలు చేద్దాం, జగన్ కలసి రావాలంటూ కొత్త నాటకానికి తెరతీశారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామాలకు సై అంటున్నారు. అయితే ఈ డ్రామాలను సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నాయకులు సెటైరిక్ గా తిప్పికొడుతున్నారు. టీడీపీ రాజీనామాలకు మా పర్మిషన్ ఎందుకంటూ వారి డ్రామాలను ఎండగడుతున్నారు.
అప్పట్లో అమరావతి రెఫరెండం పేరుతో కామెడీ..
అప్పట్లో అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని, మూడు జిల్లాల పరిధిలో తిరిగి ఎన్నికలు పెట్టాలంటూ చంద్రబాబు సవాళ్లు విసిరారు. వైసీపీకి అల్టిమేట్టం ఇస్తున్నాం అంటూ 2 రోజులు డెడ్ లైన్ పెట్టి మరీ కామెడీ చేశారు.
రాష్ట్రమంతా ఎన్నికలొద్దు, కనీసం మూడు జిల్లాల్లో అయినా పెట్టండి.. బాబ్బాబు ఒక్క జిల్లాలో అయినా ఒప్పుకోండి అంటూ బతిమిలాడుకున్నారు. జగన్ సైలెంట్ గా ఉండేసరికి చంద్రబాబు మైండ్ బ్లాక్ అయింది. డెడ్ లైన్ తర్వాత ఏం చెబుతాడో అనుకుంటే.. వైసీపీ స్పందించలేదు మేమేంచేస్తామంటూ బిక్కమొహం వేశారు.
సరిగ్గా ఇప్పుడు మరోసారి అలాంటి రాజీనామాల రాజకీయాలే చేస్తున్నారు చంద్రబాబు. టీడీపీ నేతలంతా రాజీనామాలు చేస్తారట, వైసీపీ వాళ్లు కూడా రాజీనామాలు చేసి పోరాడాలట. గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేద్దామయ్యా కలసి రా అంటే చంద్రబాబు వినలేదు సరికదా.. ప్యాకేజీయే ముద్దు అని ఓవర్ యాక్షన్ చేశారు.
ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు ఎంపీలంతా రాజీనామా చేస్తే భయపడిపోయి కేంద్రంలోని బీజేపీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా ఆపుతుందా..?
పార్లమెంట్ లో పోరాటం చేస్తే దేశవ్యాప్తంగా సమస్య చర్చకు వస్తుందా? లేక రాజీనామాలు చేసి బయట కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా..? లాజిక్ లేకుండా రాజీనామా రాజకీయాలు చేస్తూ, కామెడీ పండిస్తున్నారు చంద్రబాబు.