ఆమధ్య ప్రెస్ మీట్ లో కేటీఆర్ ఎవరు..? నాకు తెలీదే.. ఓహో సీఎం కేసీఆర్ కొడుకా..? అంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల. అయితే ఆ సెటైర్లు ఆమెకు రివర్స్ లో కూడా తగిలాయనుకోండి. ఇప్పుడు మరోసారి అలాంటి సెటైర్లే పేల్చి సెన్సేషన్ సృష్టించారు షర్మిల.
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన అభిమానులు, టీఆర్ఎస్ నేతలు, సినిమా ఇండస్ట్రీవాళ్లు, కొంతమంది వైరి పక్షాల వాళ్లు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కానీ షర్మిల చెప్పిన విషెస్ మాత్రం కాస్త వెరైటీగా ఉన్నాయి. వివాదానికి దారి తీశాయి.
కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ఓ ట్వీట్ వేశారు షర్మిల. పనిలో పనిగా నిరుద్యోగ సమస్యల్ని కూడా ప్రస్తావిస్తూ.. తెలంగాణలో నిరుద్యోగ సమస్యని తీర్చేలా ఆ భగవంతుడు కేటీఆర్ కి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ ట్వీట్ లో కోరారు. ఆ సందేశం నిముషాల్లో వైరల్ గా మారింది.
షర్మిల వెటకారాన్ని చాలామంది సీరియస్ గా తీసుకున్నారు. కేటీఆర్ అభిమానులు ఆమెకు కౌంటర్లిచ్చారు. ట్రోలింగ్ కి భయపడ్డారో లేక, మరీ అంత వ్యంగ్యం ఎందుకనుకున్నారో కానీ ఆమె ట్వీట్ ని డిలీట్ చేశారు.
సరిగ్గా ఇక్కడే అసలు స్టోరీ మొదలైంది. షర్మిలపై ట్రోలింగ్ మరింత పెరిగింది. పులివెందుల ఆడ పులి భయపడిందంటూ ఆమెను రెచ్చగొట్టారు కేటీఆర్ అభిమానులు. అంత ధైర్యం లేకపోతే ట్వీట్ వేయడం ఎందుకని ప్రశ్నించారు. ట్వీట్ వేయడానికే ధైర్యం చాలనివారికి తెలంగాణని పరిపాలించే అర్హత ఎక్కడినుంచి వస్తుందంటూ ప్రశ్నించారు. దీంతో షర్మిలకి కోపమొచ్చింది. ట్రోలింగ్ కి భయపడేదాన్ని కాదు, కావాలంటే చూడండి అంటూ డిలీట్ చేసిన ట్వీట్ ని స్క్రీన్ షాట్ తీసి పెట్టారు.
కోరి షర్మిలని రెచ్చగొట్టి, మరోసారి ఆ ట్వీట్ వేయించుకున్నారు కేటీఆర్ అభిమానులు. భయపడ్డారు అనే మాటతో షర్మిల కూడా కాస్త గట్టిగానే ఉండాలనుకున్నారు. ఇప్పుడు ట్రోలింగ్ చేసుకోండి అంటూ ఓపెన్ సవాల్ చేస్తూ ట్వీట్ వేశారు. అయితే కేటీఆర్ ని షర్మిల ఎందుకు టార్గెట్ చేశారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
కేసీఆర్ కొడుకు కేటీఆర్ అని అనడంలో షర్మిల ఉద్దేశం ఏంటి..? కేటీఆర్ అభిమానుల్ని ఆమె పదే పదే ఎందుకు రెచ్చగొడుతున్నారు. డిలీట్ చేసిన ట్వీట్ ని మళ్లీ వేసి మరోసారి దుమారం రేపడం ఎందుకనేదే అసలు ప్రశ్న.
కేటీఆర్ అభిమానుల ట్రోలింగ్ తో షర్మిల టీమ్ కూడా అలర్ట్ అయింది. ఆమెకు మద్దతుగా, టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ట్వీట్లు వేయడం మొదలు పెట్టారు. మొత్తమ్మీద సోషల్ మీడియాలో కేటీఆర్ వర్సెస్ షర్మిల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది.
సోషల్ మీడియా వార్ తో షర్మిల తక్కువ సమయంలోనే అందరి దృష్టిలో పడ్డారు, నిరుద్యోగ సమస్యని కూడా మరింత పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. చూస్తుంటే, పీకే శిష్యురాలి స్ట్రాటజీలు షర్మిలకు బాగానే వర్కవుట్ అవుతున్నట్టున్నాయి.