జగన్ నుంచి చంద్రబాబు నేర్చుకోవాల్సిన పాఠం

డిసెంబర్ 25… నవ్యాంధ్ర చరిత్రలో మరపురాని, మరచిపోలేని రోజు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త పథకాలతో ప్రతిరోజూ చరిత్రలో నిలిచిపోతున్నా.. డిసెంబర్ 25 మాత్రం భావితరాలు, బడుగు వర్గాలు కచ్చితంగా తమ జీవితాంతం గుర్తుంచుకునే…

డిసెంబర్ 25… నవ్యాంధ్ర చరిత్రలో మరపురాని, మరచిపోలేని రోజు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త పథకాలతో ప్రతిరోజూ చరిత్రలో నిలిచిపోతున్నా.. డిసెంబర్ 25 మాత్రం భావితరాలు, బడుగు వర్గాలు కచ్చితంగా తమ జీవితాంతం గుర్తుంచుకునే రోజులా నిలిచిపోతుంది. 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు.. 15.5 లక్షల ఇళ్లకు తొలి దశ శంకుస్థాపన జరగబోతున్న రోజు అది.

హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం ఎంత ముఖ్యమో చాటిచెబుతున్నారు జగన్. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కూడా లెక్కలేనన్ని హామీలిచ్చారు. రైతు రుణమాఫీ పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి.. ఇలా చాలా కబుర్లే చెప్పారు. కానీ ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు.

టిడ్కో ఇళ్ల సంగతే తీసుకుందాం. సరిగ్గా ఎన్నికల ముందు కోడ్ కూసే లోపు హడావిడిగా గృహప్రవేశాలు చేయించారు. అలా గృహప్రవేశాలు చేసినా కూడా.. ఈరోజు వరకూ ఒక్క కుటుంబం కూడా ఆ అపార్ట్ మెంట్లలో నివశించడంలేదంటే దానికి కారణం ఎవరు? ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకోవడం చంద్రబాబుకి సుతరామూ ఇష్టం లేదు. 

కేవలం ఎన్నికల ముందు పసుపు కుంకుమలంటూ జిమ్మిక్కులు చేసి గట్టెక్కేయాలని అనుకునే రకం బాబు. కానీ ప్రజలు ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారు. రుణమాఫీ పేరుతో ఓసారి మోసపోయారు, రెండోసారి బాబుకి ఓట్లు మాఫీ చేసి జగన్ ని అందలం ఎక్కించారు.

ఇక జగన్ విషయానికొద్దాం..

నవరత్నాల పథకాలు అన్నీ అనుకున్న టైమ్ కి అమలులోకి వచ్చేశాయి. ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుల్లో కేసులున్నాయి. వాటిని సాకుగా చూపి మరో మూడున్నరేళ్లు వాయిదా వేసే అవకాశం అధికార పార్టీకి ఉంది. చివరిగా ప్రతిపక్షాలపై నెపం నెట్టి ఎన్నికలకు వెళ్తే ప్రజలు మరోసారి జగన్ కి బ్రహ్మరథం పడతారు. అనుమానమేం లేదు.

కానీ జగన్ అలాంటి రాజకీయాలు చేయడంలేదు. కోర్టుల్లో కేసులున్నా కూడా వీలైనంత మేర ప్రజలకు లబ్ధి చేకూర్చాలనేదే ఆయన ఆశయం. అందుకే ఇళ్ల పట్టాల పంపిణీకి, అదనంగా ఇళ్ల నిర్మాణానికి కూడా పూనుకున్నారు. నాయకులంటే ఎన్నికలు, ఓట్లు మాత్రమే కాదని, ప్రజా సంక్షేమమే తన థ్యేయమని నిరూపిస్తున్నారు.

బాబు నేర్చుకోవాల్సింది అదే..

ఎన్నికల హామీలను ఎలా వాయిదా వేద్దాం, ఎలా ఎగరకొడదాం అని ఆలోచించే చంద్రబాబు. అడ్డంకులు ఎదురవుతున్నా ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలనే విషయాన్ని జగన్ ని చూసి నేర్చుకోవాలి.

కోర్టు కేసులతో ప్రతిపక్షాలు అడ్డు పడుతున్నా కూడా పేదలకు ఇళ్ల పట్టాలు సకాలంలో మంజూరు చేయడానికి జగన్ పడుతున్న తపన చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. వైఎస్సార్ హయాంలో జరిగిన భూ పంపిణీని మరోసారి గుర్తు చేస్తున్నారు.

ఇళ్ల పట్టాలు.. జగన్ సర్కారుకి దీవెనలు..

మరికొన్ని గంటల్లో ఊరూవాడా పండగలా ఇళ్ల పట్టాల పంపిణీ జరగబోతోంది. ప్రతి ఊరిలో స్థానిక ఎమ్మెల్యే అర్హులకు పట్టాలు పంపిణీ చేస్తారు. కొత్త లే-అవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. డిసెంబర్ 25నుంచి 15రోజుల పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. వారి సొంత నియోజకవర్గాల్లో పర్యటించి ఈ కార్యక్రమాన్ని 15రోజుల పండగగా మార్చబోతున్నారు. 

ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి, అమలులోకి వచ్చిన పథకాలు ఒక ఎత్తు అయితే.. ఈ పట్టాల పంపిణీ.. జగన్ ని మరో మెట్టు పైన నిలబెడుతుంది. బాబు ఇవన్నీ తన కళ్లతో చూడాలి, జగన్ పనితీరు చూసి నేర్చుకోవాలి.

పవన్ రాజకీయానికి మరణ శాసనం!