కరోనా వైరస్ లో కొత్త స్ట్రెయిన్ యూరప్ దేశాలను గడగడలాడిస్తూ ఉంది. ఇప్పటికే గుర్తించిన కరోనా వైరస్ రకాలతో పోలిస్తే కొత్త స్ట్రెయిన్ 70శాతం వేగంగా వ్యాపిస్తుంది అనేది ప్రాథమికంగా గుర్తించిన అంశమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త రకం స్ట్రెయిన్ గత వాటితో పోలిస్తే అధిక ప్రమాదకరమైనదా? అంటే మాత్రం ఇంకా స్పష్టమైన సమాధానం లేదు.
ఇది వరకటి కరోనా వైరస్ రకాలు ఒక్కో వయసు వారిపై ఒక్కో రకమైన ప్రభావం చూపిన దాఖలాలున్నాయి. అయితే కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపించడంతో పాటు, ఆరోగ్యంపై కూడా అధిక ఒత్తిళ్లను కలిగిస్తుందా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆందోళన అయితే ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దీంతో బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను నిషేధించడంతో పాటు, ఇప్పటికే వచ్చిన వారిపై ప్రభుత్వం డేగ కళ్లను వేసింది. అయినా.. ఈ వైరస్ వ్యాప్తిని ఆపడం తేలిక కాదని స్పష్టం అవుతోంది.
తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో నిర్వహించిన పరీక్షల్లో కొత్త వైరస్ జాడలు బయటపడ్డాయి. పలువురు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వారిలో కొందరికి కరోనా వైరస్ పాజిటివ్ కాగా, అది కూడా కొత్త స్ట్రెయిన్ ను గుర్తించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఎయిర్ పోర్టులో శాంపిల్స్ ను ఇచ్చిన కొందరు ఇంటి ముఖం పట్టారు. తీరా పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిలో కొత్త స్ట్రెయిన్ ఉందని తేలుతోందట. ఈ నేపథ్యంలో సదరు ప్రయాణికులు ఇంటి దారి పట్టడం మరింత ఆందోళనకరం.
రాజమండ్రికి చెందిన ఒక మహిళ బ్రిటన్ నుంచి వచ్చింది. ఆమె ఢిల్లీలో శాంపిల్స్ ఇచ్చి రైళ్లో సొంతూరికి ప్రయాణం అయ్యింది. పరీక్ష్లల్లో ఆమెకు కొత్త స్ట్రెయిన్ సోకిందని నిర్ధారణ అయ్యిందట. అయితే ఆమె అప్పటికే రైలు ఎక్కేసింది.
కొడుకుతో సహా సొంతూరికి ప్రయాణంలో ఉందట. ఆమె, తనయుడి ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయని అధికారులు ప్రకటించారు. మరి ఆమె రాజమండ్రిలో దిగగానే క్వారెంటైన్ కు తరలించడానికి పోలీసులు రెడీ అయ్యారు. ఆమె ఇంటి వద్దకు ఇప్పటికే పోలీసులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఇక్కడ ఆందోళన ఏమిటంటే.. ఆమె ఢిల్లీ నుంచి రాజమండ్రి వరకూ రైల్లో ప్రయాణిస్తోంది, మరి అలాంటప్పుడు ఆమె నుంచి మరెంత మందికి ఆ వైరస్ సోకే అవకాశం ఉంది? అనేది! ఆమెను రాజమండ్రికి చేరుకున్నాకా ట్రేస్ చేసి ఆసుపత్రికి తరలించడం మంచిదే.
అయితే మార్గమధ్యంలో ఆమె ద్వారా ప్రమాదంలోకి పడే వారు ఎవరైనా ఉంటే.. వారి నుంచి ఈ కొత్త స్ట్రెయిన్ మరింత మందికి పాకితే..? అనేవి ఆందోళన రేపే ప్రశ్నలు. ఇలా చూస్తే.. కొత్త స్ట్రెయిన్ ప్రమాదం ఇండియాలో కూడా మొదలైనట్టే అని అనుకోక తప్పదు!