అధికారం పోయిన 3 నెలలకే చంద్రబాబు జిల్లాలు పట్టుకుని తిరుగుతున్నారు. ప్రతి చోటా ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శల ముసుగులో చంద్రబాబు మరో దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. వైసీపీ వాళ్లు దాడులు చేస్తున్నారంటూ, కేసులు పెడుతున్నారంటూ ఒకటి రెండు ఉదాహరణల్ని చూపించి మరీ టీడీపీ కార్యకర్తలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అంతే కాదు, తన దగ్గరకు వచ్చిన కొంతమంది పార్టీ నేతలు, కేసులకు తాము భయపడబోమంటున్నారని, మన అధికారం వచ్చాక మనం కూడా ఇలాగే చేద్దామని, ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతున్నారని బాబు అన్నారు. అంటే పరోక్షంగా వైసీపీపై దాడులు చేయాలని చంద్రబాబు కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నట్టు అర్థమవుతోంది.
పగలు, ప్రతీకారాలు అంటూ పార్టీ కార్యకర్తలకు విషం నూరిపోస్తున్నారు బాబు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కిందా మీదా పడుతున్నారు. అందుకే శవ రాజకీయాలు మొదలు పెట్టారు.
ఆమధ్య కార్యకర్తలపై దాడులు, కేసులు, అరెస్ట్ లు అంటూ పరామర్శలకు వెళ్లిన బాబు, ఇప్పుడు ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. పరోక్షంగా కార్యకర్తల్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ తో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు. సొంతపుత్రుడు ఇలాంటి వాటికి పనికిరాడని తెలిసే దత్త పుత్రుడితో చంద్రబాబు వైసీపీ నేతల్ని రెచ్చగొట్టే కార్యక్రమం మొదలు పెట్టారు.
మరోవైపు తాను కూడా జిల్లాల్ని చుట్టేస్తూ అదే పని చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీలో కూడా మతాన్ని తీసుకొచ్చి పెట్టారు. టీటీడీలో అన్యమతస్తులు లేకుండా చేస్తానన్న సీఎస్ ను పథకం ప్రకారం ముఖ్యమంత్రి సాగనంపారనే దుష్ప్రచారం చేస్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే.. రాష్ట్రంలో లేనిపోని అల్లర్లు, అలజడులు సృష్టించడానికి చంద్రబాబు ఉత్సాహ పడుతున్నట్టు అర్థమవుతోంది.