చంద్రబాబుకు పెరుగుతున్న నమ్మకం…!

సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓడిపోయినా, అధికారం కోల్పోయినా ఆ బాధ నుంచి త్వరగానే కోలుకుంటూవుంటారు. మనసులో ఎంత బాధ ఉన్నా ప్రజల్లోకి వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పార్టీల అధినేతలు ఇలా ధైర్యంగా…

సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓడిపోయినా, అధికారం కోల్పోయినా ఆ బాధ నుంచి త్వరగానే కోలుకుంటూవుంటారు. మనసులో ఎంత బాధ ఉన్నా ప్రజల్లోకి వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పార్టీల అధినేతలు ఇలా ధైర్యంగా వ్యవహరించక తప్పదు. పాజిటివ్‌గా మాట్లాడక తప్పదు. పార్టీని నడిపించే నాయకుడే డీలా పడితే కేడర్‌ కుంగిపోతుంది కదా. పార్టీ బలహీనపడినా బలంగా ఉందనే చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకోవడానికి ఒక్కోసారి పరిస్థితులు కూడా కలిసివుస్తుంటాయి. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పరిస్థితి ఇలాగే ఉంది. 

ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన చంద్రబాబు చాలాకాలంపాటు తనలో తను కుమిలిపోయారు. తన తీరని ఆవేదనను బయటకు కూడా వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశానని టీడీపీని ఇంత దారుణంగా ఓడించారని కొంతకాలంపాటు ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు ఓటమి బాధ నుంచి ఇక కోలుకోలేరేమోనని, మామూలు మనిషి కావడానికి చాలాకాలం పడుతుందని జనం అనుకున్నారు. కాని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాల కారణంగా చంద్రబాబు క్రమంగా పుంజుకోవడం ప్రారంభించారు. సర్వశక్తులు కూడదీసుకొని పోరాటం చేయడం ప్రారంభించారు. 

ఆవేదనతో మూగవోయిన గొంతు క్రమంగా ఖంగుమనడం మొదలైంది. ఆయనలో మళ్లీ ఉత్సాహం పెల్లుబికింది. ఇసుక కొరత, ఇంగ్లీషు మీడియంలో బోధన నిర్ణయాలపై మొదలైన చంద్రబాబు పోరాటం మూడు రాజధానులు నిర్ణయంతో పీక్‌స్టేజికి వెళ్లింది. చివరకు మండలి రద్దుతో పరాకాష్టకు చేరుకుంది. జగన్‌ ఒక్కో నిర్ణయం ప్రకటిస్తూపోతుంటే చంద్రబాబులో నమ్మకం, ఆత్మవిశ్వాసం అదే రేంజ్‌లో పెరుగుతూ వచ్చాయి. 'ఎస్‌…నేను మళ్లీ అధికారంలోకి వస్తాను' అని డిసైడయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు తన ఆవేదనను ఎలా బయటపెట్టుకున్నారో, అదేవిధంగా అధికారంలోకి వస్తాననే నమ్మకాన్ని కూడా బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. 

నిన్న మండలి రద్దుచేసినప్పుడు టీడీపీ సభ్యులు సభకు హాజరు కాలేదు. ఆ సమయంలో ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. మీడియాతో మాట్లాడారు. మండలి అధికారికంగా రద్దు కావడానికి కనీసం ఏడాదిన్నర రెండేళ్లు పడుతుందన్న చంద్రబాబు 'ఇప్పుడు మండలి రద్దయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. నేను మళ్లీ అధికారంలోకి రాగానే మండలిని పునరుద్ధరిస్తాను' అన్నారు. ఇటీవల చాలాసార్లు టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి జనం టీడీపీని కోరుకుంటున్నారని ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు. 

అందుకే దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ను సవాలు చేశారు. వైకాపా ఎన్నికల్లో గెలిస్తే మూడు రాజధానులు పెట్టుకోవచ్చని, తాను రాజకీయాలనుంచి వైదొలగుతానని అన్నారు. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా జనంలో వ్యతిరేకత ఉందని బాబు భావిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలూ వ్యతిరేకించినప్పటికీ ఉద్యమాన్ని లీడ్‌ చేసింది మాత్రం టీడీపీయే. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు. నిజానికి ఉద్యమాన్ని లీడ్‌ చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉంది. వేల ఎకరాల భూమి లాండ్‌పూలింగ్‌ ద్వారా తీసుకున్నది, అమరావతి నగర నిర్మాణానికి పునాదులు వేసింది ఆయనే కాబట్టి ముందుండి పోరాటాన్ని నడిపించారు. 

ఎన్టీఆర్‌ రద్దు చేసిన మండలిని పునరుద్ధరించే ఆలోచన బాబు అధికారంలో ఉండగా చేయలేదు. అది వైఎస్సార్‌ పరిపాలనలో మళ్లీ జీవం పోసుకుంది. ఒకవేళ బాబు మళ్లీ అధికారంలోకి వస్తే దాన్ని పునరుద్ధరించక తప్పదు. లేకపోతే జగన్‌ బాటలో నడిచినట్లవుతుంది. అందుకే మండలి రద్దుపై గగ్గోలు పెట్టారు. తాజాగా హైకోర్టు ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వేయడాన్ని కోర్టు ఆక్షేపించింది. ఇంగ్లీషు మీడియం విషయంలో అక్షింతలు వేసింది. ఈ రెండూ చంద్రబాబుకు సంతోషం కలిగించివుంటాయి. వచ్చే నాలుగేళ్లలో జగన్‌ ఇలాగే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబుకు నమ్మకం ఇంకా పెరిగిపోతుంది. మరి జగన్‌ ఇలాగే చంద్రబాబుకు నమ్మకం పెంచుకుంటూ పోతారా?

మా తార‌క్ బావ‌కి ధ్యాంక్స్ చెప్పుకుంటా

ప్రజలు చీకొట్టిన వాళ్ళ ఆమోదం అవసరమా

రామోజీరావు కోసం అప్పట్లో మండలిని రద్దు చేశారు