ఏపీ వ్యవహారాల గురించి రన్నింగ్ కామెంటరేటర్ గా మారారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి, లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా నెగ్గి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను బలోపేతం చేసే చర్యలు ఏమైనా చేపడతారేమో అని అంతా అనుకున్నారు. అయితే మళ్లీ స్థానిక ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ అదే కథ. రేవంత్ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కారు జోరు కనిపించింది. దీంతో లోక్ సభ సభ ఎన్నికల్లో ఏదో గాలివాటుగా కాంగ్రెస్ వాళ్లు గెలిచారేమో అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ, స్థానిక స్థాయిల్లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఢీ కొట్టలేదనే అభిప్రాయాలు ఏర్పడుతూ ఉన్నాయి.
ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా దయనీయంగా ఉంటే.. ఏదో పొద్దుపోని పెద్దమనిషిలా రేవంత్ రెడ్డి ఏపీ వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా చంద్రబాబుకు వంత పాడుతూ ఉన్నారు! కాంగ్రెస్ పార్టీని దేశంలో దేవుడు కూడా రక్షించే పరిస్థితుల్లో లేడు అంటే ఆ మాట ఊరికే రాదు. ఆల్రెడీ చంద్రబాబుతో అంటకాగి కాంగ్రెస్ తెలంగాణలో నిండా మునిగింది. చంద్రబాబును ఏపీ ప్రజలు కూడా తిరస్కరించారు.
ఇంకా చంద్రబాబును కాంగ్రెస్ వాళ్లు తమ చంకలో పెట్టుకోవడానికి ఉబలాటపడుతూ ఉన్నాడు. వెనుకటికి ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఏం పనులు చేసి పెట్టారో వీడియోలో కూడా చిక్కారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారీయన. తమ ఓటు బ్యాంకు ఏదో.. తమ మూలాలు ఏవో కాంగ్రెస్ నేతలు తెలంగాణలో మరిచిపోయినట్టుగా ఉన్నారు. చంద్రబాబుకు చంచాగిరి చేస్తే.. తెలంగాణలో అయినా తమ పరిస్థితి ఏమవుతుందో వారు అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు. రేవంత్ వంటి వాళ్లు రేపు పీసీసీ అధ్యక్షులు అయి ఇలా మాట్లాడుతూ ఉంటే.. కాంగ్రెస్ ఉన్న బలం కూడా పోతుందే తప్ప మరోటి కాకపోవచ్చు!
ముందు రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు తమ ఇంటిని సర్దుకోవాలని.. ఏపీ వ్యవహారాల గురించి పోచికోలు మాట్లాడితే వచ్చే ఉపయోగం శూన్యం, ఆ పై తెలంగాణలో తమ సంప్రదాయ ఓటు బ్యాంకు మరింత దూరం అయిపోయి, అది కేసీఆర్ కు దగ్గరవుతోందనే వాస్తవాలను గ్రహించాలని కాంగ్రెస్ వీరాభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ టీ కాంగ్రెస్ నేతకు మాత్రం చంద్రబాబు భజనే సుఖంగా ఉన్నట్టుంది. ఎవరి రాతనూ ఎవరూ మార్చలేరని పెద్దలు ఊరికే చెప్పలేదేమో!