నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వార్ వన్‌సైడ్ అన్నట్టుగా వైసీపీ ఫ్యాన్ గాలి …సార్వత్రిక ఎన్నికల ఫలితాలనే మరోసారి రిపీట్ చేసింది.
మరీ ముఖ్యంగా కంచుకోట కుప్పం నిలువునా కూలిపోయింది. దీంతో టీడీపీ పనై పోయిందని, చంద్రబాబు పలాయనం చిత్తగించక తప్పదనే ప్రచారం ఊపందుకుంది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రమే టీడీపీ సత్తా చాటింది.
తుమ్మినా, దగ్గినా మీడియా ముందుకొచ్చే చంద్రబాబు, ట్విటర్ ఎక్కి గగ్గోలు పెట్టే ఆయన తనయుడు లోకేశ్ తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత పత్తా లేకుండా పోయారు. రెండురోజుల క్రితం ఒక వైపు కుప్పంలో ఎన్నికలు జరుగుతుండగా, చంద్రబాబు మీడియా ముందుకొచ్చి చిందులు తొక్కడం చూశాం.
ఇదే సందర్భంలో కుప్పంలో రెండు రోజుల పాటు లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించి… వైసీపీపై నోరు పారేసుకున్నారు. ఆ తర్వాత కూడా చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సోషల్ మీడియా వేదికగా లోకేశ్ స్పందించిన ఉదంతాలు ఉండనే ఉన్నాయి.
కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అబ్బాకొడుకులు ఎటు వెళ్లారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమికి కారణాలేంటో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడితో చంద్రబాబు మాట్లాడించారంటే… ప్రజాదరణ లేని నేత ప్రజాతీర్పుపై మాట్లాడంకంటే విడ్డూరం మరేదైనా వుంటుందా? అనే సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.