మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కంచుకోట కుప్పంతో పాటు మరొకటి కూడా బద్దలైంది. కుప్పంలో కంటే దారుణ పరాజయాన్ని ఆ కంచుకోటలో టీడీపీ మూటకట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాలిలో అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ కొట్టుకుపోయింది. 20 వార్డులకు గాను కేవలం రెండింటిలో మాత్రం టీడీపీ గెలుపొందింది. దీన్నిబట్టి టీడీపీ అడ్డాగా పేరొందిన పెనుకొండలో టీడీపీ ఎంతటి దయనీయ స్థితికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
పెనుకొండ నగర పంచాయతీకి తొలిసారిగా నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అంటూ తలపడ్డాయి. పెనుకొండ నగర పంచాయతీలో 20 వార్డులున్నాయి. 20,409 మంది ఓటర్లున్నారు. వీరిలో 16,864 మంది ఓటు హక్కును వినియోగించు కున్నారు. 82.63 శాతం పోలింగ్ నమోదైంది. చివరికి అధికార పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. అధికార పార్టీ వైసీపీ 18 వార్డుల్లో విజయకేతనం ఎగుర వేసి సత్తా చాటింది. టీడీపీ రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
టీడీపీ ఆవిర్భావం నుంచి పెనుకొండలో టీడీపీనే పైచేయి సాధిస్తూ వస్తోంది. పెనుకొండ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 1983,1985లలో టీడీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ తరపున చెన్నారెడ్డి, ఆయన హత్యానంతరం 1991లో జరిగిన ఉప ఎన్నికలో చెన్నారెడ్డి తనయుడు రమణారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత అక్కడ పూర్తిగా పరిటాల కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. 1994, 1996 (ఉప ఎన్నిక), 1999, 2004లలో పరిటాల రవి తిరుగులేని నాయకుడిగా విజయాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చారు.
పరిటాల రవి హత్యానంతరం 2005 లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య పరిటాల సునీత విజయం సాధించారు. నియోజక వర్గాల పునర్విభజన అనంతరం పరిటాల కుటుంబం రాప్తాడుకు మకాం మార్చింది. ఇక్కడి నుంచి టీడీపీ నేత బీకే పార్థసారథి 2009, 2014లో గెలుపొందారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పార్థసారథి ఓటమిపాలయ్యారు. ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలుపొందిన శంకర్‌నారాయణ ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. తాజా నగర పంచాయతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ, వైసీపీలు చివరి వరకూ శక్తివంచన లేకుండా పోరాటం చేశాయి. చివరికి వైసీపీనే ప్రజానీకం ఆదరించింది. టీడీపీకి ఓటమి కంటే…మరీ రెండు సీట్లకే పరిమితం చేయడం జీర్ణించుకోలేని విషయం.