52 అసెంబ్లీ సీట్లకు గానూ తెలుగుదేశం పార్టీకి మూడంటే మూడు అసెంబ్లీ సీట్లను ఇచ్చారు రాయలసీమ ప్రజలు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని రాయలసీమ చిత్తుచిత్తుగా ఓడించింది. మిగతా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ చిత్తైపోయినా, రాయలసీమ మాత్రం చంద్రబాబు పార్టీని చిత్తుకింద కొట్టి వదిలింది. కేవలం అతి తక్కువ సీట్లను ఇవ్వడం మాత్రమే కాదు, మొత్తం ఓట్ల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ రాయలసీమ లో చిత్తయ్యింది. రాయలసీమ ప్రాంతంతో పాటు.. గ్రేటర్ రాయలసీమ అనదగ్గ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వచ్చిన ఓట్లతో పోలిస్తే.. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు చాలా తక్కువ!
ఈ ఆరు జిల్లాల్లో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద భారీ నుంచి అతి భారీ మెజారిటీలు సాధించారు. ఒక్కోరు పాతిక వేలతో మొదలుపెడితే, ముప్పై..నలభై..యాభై వేల స్థాయి మెజారిటీలు ఏకంగా డెబ్బై వేల స్థాయి మెజారిటీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను వరించాయి! తెలుగుదేశం పార్టీపై సీమ జనాల్లో ఎంత కసి ఉందో చెప్పడానికి గత ఎన్నికల ఓట్ల లెక్కలు, సీట్ల లెక్కలు చాలు.
స్వయంగా చంద్రబాబు నాయుడుకు కూడా మెజారిటీ తగ్గిపోయింది. ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల్లో పోటీ చేసి, ఏదో స్వల్ప స్థాయి మెజారిటీతో ఎమ్మెల్యేగా బయటపడ్డారు చంద్రబాబు నాయుడు. స్థూలంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పట్ల రాయలసీమ ప్రజలు ఇచ్చిన తీర్పు.. మామూలుది ఏమీ కాదు. ఆ పార్టీ కంచుకోటలు అనుకున్నవి బద్ధలైపోయి, ఇక కోలుకుంటుందా? అనేంత స్థాయిలో అనుమానాలు రేకెత్తించేంత స్థాయిలో తీర్పునిచ్చారు రాయలసీమ ప్రజలు.
మరి వారి తీర్పును ఇప్పుడొకసారి పరిశీలిస్తే.. బహుశా వాళ్లు తెలుగుదేశం పార్టీ బుద్ధిని, చంద్రబాబు నాయుడి తీరును పూర్తిగా అర్థం చేసుకున్నారు. చంద్రబాబునాయుడుకు ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్పారు.
రాయలసీమ అంటే చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి చులకనే అని వేరే చెప్పనక్కర్లేదు. ఈ చులకన భావంతోనే ఆయన సీమకు అన్యాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమకు దక్కాల్సిన న్యాయమైన వాటా కూడా దక్కనీయలేదు. పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కారు.
రాయలసీమకు హై కోర్టును అడిగిన న్యాయవాదులు అరెస్టులు చేయించారు. రాజధాని, హైకోర్టు మాటలెలా ఉన్నా.. రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు కావాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను, ప్రైవేట్ ఫైర్మ్స్ ను కూడ అమరావతి దారి పట్టించిన ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే. అలాంటి పనులు చేసి.. రాయలసీమ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసి.. చంద్రబాబు నాయుడు తన బుద్ధిని చూపించారు. అందుకు తగిన విధంగా రాయలసీమ ఓటర్లు చంద్రబాబును, ఆయన పార్టీని సత్కరించారు.
అయినా కూడా చంద్రబాబులో మార్పు మాత్రం కనిపించడం లేదు. రాయలసీమ గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తున్నారు? అంటే.. యథారీతినే! రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కిముక్కుమనడం లేదు. అమరావతి.. అమరావతి..అంటూ తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు నాయుడు రాయలసీమ మాటెత్తడం లేదు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం కార్యరూపం దాలిస్తే.. సీమ నీటి కరువుకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే. శతాబ్దాలుగా కరువు కాటకాలకు కేరాఫ్ గా నిలిచిన రాయలసీమ గతిని ఆ పథకం ఒక్కటీ మార్చేస్తూ ఉంది. అదేమీ లక్షల కోట్ల మొత్తానిది కాదు. ఐదారు వేల కోట్ల రూపాయల స్థాయి వ్యయంతో రాయలసీమ నీటి కరువుకు శాశ్వత పరిష్కారం లబిస్తుంది. అలాంటి గొప్ప ఆలోచన చేసినందుకు జగన్ రాయలసీమ వాసులు అభినందిస్తూ ఉన్నారు.
అయితే ఈ విషయంలో పక్క రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. న్యాయమైన వాటాను, సహజమైన వాటాను, కేవలం వరదగా సముద్రంలోకి నీరు వెళ్లేటప్పుడే నీటిని తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూ ఉంది. ఇంకా రకరకాల వ్యక్తులు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణలో పాలక, ప్రతిపక్షాలు ఏకం అయ్యి రచ్చ చేస్తున్నాయి. వారికి అన్యాయం జరగకపోయినా గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదు.
రాష్ట్ర ప్రయోజనాలు, రాయలసీమ ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టడం లేదు. అదే అమరావతి మీద గగ్గోలు పెట్టమంటే..ఒకటే ఏడుపు! అదే రాయలసీమ గతినే మార్చే ప్రాజెక్టు విషయంలో మాత్రం కిక్కురుమనరు! ఇదీ చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు. మరి..ఈ పరిస్థితులను గమనిస్తే.. చంద్రబాబుకు మూడు సీట్లను ఇచ్చిన రాయలసీమ ప్రజలది ఏ మాత్రం తప్పుకాదని స్పష్టం అవుతోంది. చంద్రబాబు తీరును వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఓటేశారు. అయినా చంద్రబాబులో మార్పు రావడం లేదు.
బహుశా ఇదే తీరే కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో ఆ మూడు సీట్లు అయినా మిగులుతాయో లేదో చంద్రబాబే ఆలోచించుకోవాలని పరిశీలకులు అంటున్నారు!