మనవాడే…మరిచిపోండి…కాదంటే కడిగేయండి

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు సమాజ జీవచ్ఛవాన్ని..అంటారు కవి సిరివెన్నెల ఓ పాటలో.. ఇక్కడ వడ్డించేవాడు మనవాడైతే ఏదైనా, ఎలాగైనా సాగిపోతుంది. లేదా మనం వడ్డించేది తినేవాడు వున్నంతకాలం, మనకు ఏం…

నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు సమాజ జీవచ్ఛవాన్ని..అంటారు కవి సిరివెన్నెల ఓ పాటలో.. ఇక్కడ వడ్డించేవాడు మనవాడైతే ఏదైనా, ఎలాగైనా సాగిపోతుంది. లేదా మనం వడ్డించేది తినేవాడు వున్నంతకాలం, మనకు ఏం కావాలంటే అలా, మనం ఎలా అంటే అలా సాగిపోతుంది..తేడా వచ్చినపుడు అసలు విషయం బయటకు వస్తే, ఔరా అని ముక్కున వేలు వేసుకోవడం సామాన్యుల పనవుతుంది.

ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే, విజయవాడ స్వర్ణ ప్యాలస్ హొటల్ అన్నది చాలా పాపులర్. విజయవాడ వాసులకు, విజయవాడకు వెళ్లి వచ్చేవారికి బాగా పరిచయం వున్న, పాపులర్ హోటల్. అలాంటి హోటల్ భవనానికి అసలు భవననిర్మాణ అనుమతి లేదు..1989 నుంచి ఇప్పటి వరకు కేవలం నివాస నిర్మాణం అనుమతి తీసుకుని, హోటల్ గా నిర్వహిస్తున్నారన్నది నిగ్గుతేలిన నగ్నసత్యం.

అనుమతి అక్కరలేదు

1984లో హోటల్ నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంటే, నిబంధనలకు అనుగుణంగా లేదని అనుమతి ఇవ్వలేదు. 1989లో నివాస పరమైన నిర్మాణానికి అనుమతి కోరారు. ఆ మేరకు అనుమతి వచ్చింది. కానీ హోటల్ ను ఏర్పాటుచేసిన నిర్వహిస్తున్నారు. అంతే కాదు, అనుమతి లేకుండా మరో అంతస్తు కూడా నిర్మించారు.

అంటే 1989 నుంచి 2020 వరకు, సుమారు మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు చూసీ చూడనట్లువదిలేసారు అన్నమాట. ఇలా ఏ సామాన్యుడైనా చేయగలరా? ఎవరైనా ఓ డొమస్టిక్ కరెంట్ కనెక్షన్ తీసుకుని, కమర్షియల్ గా వాడితే వేలు, లక్షలు ఫైన్ పడుతుంది. డొమస్టిక్ ప్లాన్ పర్మిషన్ తీసుకుని, కాస్త డీవియేషన్ చేస్తే, ఎప్పుడో అప్పుడు భవనం కూలిపోతుంది.

కానీ స్వర్ణప్యాలస్ వ్యవహారం దాదాపు మూడు దశాబ్దాలు అంటే దాదాపు ఆరు ప్రభుత్వాలు మారాయి. కానీ ఏ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించలేదు. అంటే ప్రభుత్వం పని ఓ హోటల్ కు సరైన అనుమతులు వున్నాయా? లేదా? అన్నది గమనించాలని కాదు నా ఉద్దేశం. ఏ ప్రభుత్వ హయాంలోనూ ఏ మున్సిపల్ ఉద్యోగి కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఎందుకంటే ఎవరికి తెలియకపోయినా, మున్సిపల్ ఉద్యోగులకు తెలుసు కదా? ఇచ్చిన అనుమతి ఏమిటో? చేస్తున్న పనేమిటో?

ఎవరి అవసరాలు వారివి

అంటే ఇక్కడ రెండు కారణాలు వుంటాయి. ఒకటి ఎవరికి ముట్టేవి వారికి ముట్టడం. రేండు అన్ని ప్రభుత్వాలు కూడా సర్ణ ప్యాలస్ కు అనుకూలంగా వుండడం. ఇప్పటిలా ఏ ఒక్క ప్రభుత్వం అనుకూలంగా లేకపోయినా, ఈ విషయం ఎప్పుడో బయటకు వచ్చి వుండేది. ఇప్పుడు కూడా ఈ ప్రమాదం జరగకపోయి వుంటే, బయటకు వచ్చి వుండేది కాదేమో?

పలుకుబఢి వుంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే అనడానికి స్వర్ణ ప్యాలస్ అనుమతుల వ్యవహారం జస్ట్ ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. నికార్సయిన ఎంక్వయిరీ జరగాలే కానీ గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశ వ్యాప్తంగా ఇలాంటి వ్యవహరాలు వేలు లక్షలు వుంటాయి. అంతెందుకు ఓ సినిమా స్టూడియోను తమకు ఇష్టం వచ్చినట్లు అనుమతులు లేకుండా కట్టేసి, తరువాత ప్రభుత్వం తమది కావడంతో, ఓ స్కీమును ప్రకటించేసి, కట్టిన కట్టడాలు అన్నీ సింపుల్ గా ఒక్క ఫీజుతో రెగ్యులరైజ్ చేసుకున్నారు.

ఇలాంటి అనుమతులు లేని హోటల్ ను అర్జెంట్ గా ఆసుపత్రిగా మార్చేసారు. కరోనా కల్లోలం వ్యాపించడం, అర్జెంట్ గా అనేకానేక బెడ్ లు అవసరం పడడం, డిమాండ్ వుండడంతో, లాడ్ఝ్ లు కాస్తా ఆసుపత్రులుగా మారిపోయాయి. ఇక్కడ ఓ చిన్న అప్రస్తుత ప్రసంగం వుంది.

ఆసుపత్రుల వ్యాపారం

ఓ సినిమాలో కమెడియన్ ఆసుపత్రిలో ఏదో వంకన చేరి, ఆ రూమ్ కు అమ్మాయిలను తెచ్చుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. హోటల్ అయితే రిస్క్…ఆసుపత్రి అయితే పోలీస్ రెయిడ్ లు అవీ వుండవని అంటాడు. కామెడీకి అన్నా ఇందులో కొంత నిజం వుంది.

అసలు హోటల్ కు ఆసుపత్రికి ఏమిటి తేడా?

కార్పొరేట్ ఆసుపత్రుల్లో విలాసవంతమైన రూమ్ లు వుంటాయి. అన్నిరకాల సదుపాయాలు వుంటాయి. అదనంగా వైద్య సౌకర్యాలు వుంటాయి.

హొటళ్లలో వైద్య సౌకర్యాలు మినహ మిగిలినవి అన్నీ వుంటాయి.

ఈ సౌకర్యాల సంగతి పక్కన పెడితే, వెసులుబాట్లు చాలా వుంటాయి. హోటల్ అంటే అందరికీ లోకువే. కానీ ఆసుపత్రి అనగానే ప్రతి వారు లోంగి వుంటారు. అందువల్ల హోటల్ వ్యాపారం కన్నా ఆసుపత్రుల వ్యాపారం బెటర్. అటు హోటల్ వ్యాపారమూ వుంటుంది. ఇటు ఆసుపత్రుల రాబడీ వస్తుంది.

ఈ సూత్రం కరోనా టైమ్ లో కలిసివచ్చింది, తెలిసివచ్చింది. అందుకే కరోనా టైమ్ లో బిజినెస్ లేక ఖాళీగా వున్న హోటళ్లలో చాలా వరకు కోవిడ్ ఆసుపత్రులుగా మారిపోయాయి. పెరుగుతున్న కేసులు, చాలినన్ని పడకలు లేకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వాలు చకచకా అనుమతులు ఇచ్చేసాయి. హోటళ్లుగా నడుస్తున్నపుడే నిబంధనలు బేఖాతరు చేసిన సంస్థలు, ఇక ఆసుపత్రులుగా మారితే ఎలా వుంటాయో? ఊహించుకోవచ్చు. స్వర్ణ ప్యాలస్ లో అదే జరిగింది.

స్పందన అంతంత మాత్రం

ఇదే వేరే విషయంలో అయితే స్పందన ఎలా వుండేదో కానీ, స్వర్ణ ప్యాలెస్ హోటల్ కమ్ కరోనా సెంటర్ విషయంలో మాత్రం ప్రతిపక్షం స్పందన చాలా అంటే చాలా నీరసంగా వుండడం విశేషం. నిజానికి ప్రయివేటు కోవిడ్ సెంటర్ అయినా, ప్రభుత్వం బాధ్యతగా మృతులకు నష్టపరిహారం ప్రకటించింది. మరి ఆ తరువాత ఏ ప్రతిపక్ష నాయ కుడు అయినా  ఈ విషయంలో గట్టిగా మాట్లాడితే ఒట్టు. జనసేన పవన్ కళ్యాణ్ అయితే అస్సలు మాట్లాడలేదు. ఎందుకలా?  దీని అంత వెనుక సమస్య…మళ్లీ మామూలే..సామాజిక వ్యవహారం.

డాక్టర్ రమేష్ ఆసుపత్రితో తెలుగుదేశం పార్టీకి బంధాలు వున్నాయని ఇప్పటికే వార్తలు వున్నాయి.  తనకు నచ్చిన కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే అవకాశం తనకు వచ్చినపుడు అచ్చెంనాయుడు ఎంచుకున్న ఆసుపత్రి రమేష్ హాస్పిటల్. అలాంటి ఆసుపత్రి స్వర్ణప్యాలస్ ను అద్దెకు తీసుకుని కోవిడ్ సెంటర్ ను నిర్వహిస్తోంది. స్వర్ణ ప్యాలస్ కు ఎంత పొలిటికల్ దన్నులేకపోతే అన్ని దశాబ్దాల పాటు ఎటువంటి సరైన అనుమతులు లేకుండా ఓ పెద్దనగరం నడిబొడ్డున అంతటి ఆసుపత్రిని నడుపగలగుతుంది. అలాంటి ఆసుపత్రిని ఎంత పరపతి లేకపోతే, చటుక్కున కోవిడ్ ఆసుపత్రిగా మార్చగలగుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే ఈ కోవిడ్ సెంటర్ లో మరణించిన వారిలో చాలా మందికి కోవిడ్ నెగిటివ్ ఫలితాలు నమోదు కావడం.

విశాఖలో చీమ చిటుక్కు మంటే గగ్గోలు పెట్టేవారు అంతా విజయవాడ సంఘటన విషయంలో మౌనం వహించారు. ఇక అనుకూల మీడియా ఆఫ్ తెలుగుదేశం అయితే చెప్పనక్కరలేదు. అసలు తన కళ్ల ముందు ఏమీ జరగనట్లే వుంది. ఇప్పుడు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం లేకపోయి వుంటే, ఈ ప్రమాదం వార్త మరింత సులువుగా, మరింత వేగంగా మరుగునపడిపోయి వుండేది.

మీకు బెజవాడ అయితే…

నాది బెజవాడ. నేను ఇక్కడ చదువకున్నాను. నాకు ఈ నగరం మీద ప్రేమ వుండదా? అభిమానం వుండకూడదా? అంటూ కాస్త గట్టిగానే అరిచి చెప్పారు ఎంపీ రామకృష్ణం రాజు గారు. ఆయన పుట్టి, పెరిగింది వెస్ట్ గోదావరి. అయినా అమరావతి రాజధాని కావాలి. ఆ ముసుగులో విజయవాడ అభివృద్ది కావాలి. అది ఆయనకు ఆనందం. ఎందుకంటే విజయవాడతో ఆయన కు చదుకున్న బంధం వుంది కనుక.

మంచిదే..జస్ట్ చదువుకున్నబంధంతోనే మీరు విజయవాడ మీద అంత మమకారం పెంచుకుంటే, విశాఖలోనూ, ఉత్తరాంధ్రలోనో పుట్టి పెరిగిన వారికి ఎంత అభిమానం వుంటుంది ఆ ప్రాంతంపై. వారికి మరి వారి మనోభావాలు పరిగణనలోకి తీసుకోనక్కరలేదా? వారికి రాజధాని కావాలని, తమ విశాఖ అభివృద్ది చెందాలని వుండదా?

జిల్లాలకు ఏం చేసారు?

13 జిల్లాలకు 180 ప్రాజెక్టులు ప్రకటించా అవి పూర్తి చేస్తే చాలు వికేంద్రీకరణ జరిగిపోయినట్లే అంటున్నారు చంద్రబాబుగారు. గతంలో ఈకాలమ్ లో ప్రస్తావించిన సంగతే. రాజధానిగా అమరావతిని ప్రకటిస్తున్నపుడు మిగిలిన జిల్లాల వారు బాధపడకుండా, ప్రతి జిల్లాకు ఇన్ని వరాలు అంటూ ఒక హామీల పత్రాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు చంద్రబాబు. వాటిలో వన్ పర్సంట్ కూడా నెరవేరలేదన్నది వాస్తవం.

ఆయన అయిదేళ్ల హయాంలో అమరావతి నిర్మాణం వన్ పర్సంట్ నో, టెన్ పర్సంట్ నో పూర్తి చేసారు అనుకుందాం. మరి జిల్లాలకు ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారు. అవి మాత్రం రాబోయే ప్రభుత్వం మీదకు పాస్ ఆన్ చేసారు? ఇంకా చంద్రబాబు ఏం చెబుతున్నారు? ఎడ్యుకేషనల్ సంస్థలు కేటాయించా తిరుపతికి, విశాఖకు అంటున్నారు.

నిత్యం సందడిగా వుంటే హైకోర్టును కర్నూలుకు కేటాయిస్తేనే, ఏం లాభం? జిరాక్స్ దుకాణాలు తప్ప మరేం వస్తాయి దీంతో అని కామెంట్ చేస్తున్నారు. మరి ఐఐఎమ్ లు, ఇంకా ఇలాంటి రేర్ విద్యా సంస్థలు, విశాఖకో, తిరుపతికో ఇస్తే ఏం వస్తాయి? వంద మంది విద్యార్తులు వుంటే ప్రభుత్వ హాస్టల్ తప్ప. పోనీ ఈ విద్యా సంస్థలు అన్నీ అమరావతికి తీసేసుకుని, ఎయిమ్స్ ను కర్నూలుకు ఇచ్చేయలేకపోయారా? అలాగే హైకోర్టును ఇవ్వలేకపోయారా?

ఇంకా అనేక ఇలాంటి సంస్థలు అన్నీ కృష్ణ గుంటూరుకు తరలించేసి, ఇప్పుడు ఉత్తరాంధ్ర, సీమ వాసులపై బాబుగారు చాలా సానుభూతి కబుర్లు చెబుతున్నారు. ఇవన్నీ అక్కడి జనాలు నమ్ముతారనే అనుకుంటున్నారా?

నాణానికి అటు చూడండి

కాంగ్రెస్ ను ఎవ్వరో ఓడించనక్కరలేదు, ఆ పార్టీ జనాలు చాలు అని వెనకటికి సామెత. తెలుగుదేశం పార్టీకి దాని అనుకూల మీడియానే పెద్ద శతృవు. ఇటు బిసి లను, అటు రెడ్డి సామాజిక వర్గాన్ని తెగ టార్గెట్ చేస్తోంది ఆ మీడియా. ఇదంతా వైకాపాను కార్నర్ చేయడానికి అనుకుని, తన చిత్తానికి చేసుకుంటూ మురిసిపోతోంది. కానీ అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం మనసులో ఏం ముద్ర వేస్తున్నట్లు. జగన్ తమ కులానికి ఇంత చేస్తున్నాడు అనేగా. బిసిల మనసుల్లో ఏం ముద్రవేస్తున్నట్లు, బాబు అనుకూల మీడియా తమవాళ్లను ఇంతలా వేధిస్తోంది లేదా వెంటాడుతోంది అనేగా?  అలాగే ఇదే మీడియా అమరావతి కోసం తమ సర్వస్వం ఒడ్డుతోంది. అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు ఎలా ఫీలవుతారు అన్నది ఇక్కడ గమనించడం లేదు.

ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి అనుకుందాం. రెడ్డి సామాజిక వర్గం ఎటు వుంటుంది? బిసి లు ఎక్కువగా ఎటు వుంటారు? రాయలసీమ సంగతేమిటి? ఉత్తరాంధ్ర మాటేమిటి? ఇదంతా ఎవరు పుణ్యం కట్టుకుంటున్నారు అంటే దేశం అనుకూల మీడియా. నిజానికి వైకాపాకు శతృవు కాదు. తెలుగుదేశంలో వున్నశల్యుడు అనుకోవాలి.

ఇంకా ఎఫెక్ట్ వుందా?

అసలు ప్రింట్ మీడియా ప్రభావం తెలుగు ప్రజలపై వుందా?  ఇప్పుడు ప్రధాన దినపత్రికలు కరోనా కాటుతో గిలగిల లాడుతున్నాయి. సర్క్యులేషన్ తగ్గించుకున్నాయి. సిబ్బందిని తగ్గించుకున్నాయి. వార్తలు తగ్గించుకున్నాయి. పల్లెటూళ్లకు పత్రికలు వెళ్లడం లేదు. దుకాణాల్లో పేపర్లు అమ్మడం తగ్గిపోయింది. ఆదాయం సంగతి సరేసరి.

ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రింట్ మీడియా తెలుగు ప్రజల మీద ఏ మేరకు ప్రభావం చూపించగలుగుతుంది. పైగా ఈ ప్రింట్ మీడియా ఏది? ఎటువైపు అన్నది ప్రతి కామన్ మాన్ కు పక్కాగా అవగాహన వచ్చేసింది.  విజయవాడలో ప్రమాదం జరిగితే, కోవిడ్ సెంటర్ లో ప్రమాదం అని ఓ మీడియా రాస్తుంది. ప్రయివేటు కోవిడ్ సెంటర్ అని మరో మీడియా క్లారిటీ ఇస్తుంది. మరి కోవిడ్ సెంటర్ అంటూ ప్రయివేటును ప్రయివేటుగా దాచి పెడదాం అనుకున్న మీడియా కష్టం ఏమయినట్లు? వృధాపోయినట్లేగా? ఇలాంటి మీడియాను నమ్ముకునే అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ నట్టేట మునిగింది. కానీ అదే మీడియాను నమ్ముకునే 2024 ఎన్నికల వరకు ఈదాలనుకుంటోంది.  అనుభవం అయినా తత్వం బోధపడకపోవడం అంటే ఇదేనేమో?

చాణక్య
[email protected]