ఇంతకీ నాగబాబు ఏం చేస్తుంటారు? అంటే.. తన ట్వీట్లతో జనసేన అనే పార్టీకి ఉన్న కొండకూచో సామాన్య ఓటర్లను కూడా దూరం చేస్తుంటారు అని చెప్పొచ్చు. జనసేనకు ప్రధాన అభిమానగణం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, వారిలో కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వారు అధికం. వారిని దాటి కొద్దో గొప్పో ఆలోచన పరులు ఎవరైనా జనసేనను అభిమానిస్తూ ఉంటే, ఆ పార్టీకి ఓటేసే ఆలోచనలో ఉంటే.. వారిని తన కామెంట్లతో దూరదూరంగా తరమడాన్ని పనిగా పెట్టుకున్నట్టున్నారు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.
సోషల్ మీడియా అకౌంట్లలో ఏదో అప్పటికప్పుడు పోస్టు చేయడం, ఆ తర్వాత వాటి గురించి తనే వివరణలు ఇచ్చుకోవడం, ఆపై ఆ ట్వీట్లతో జనసేనకు సంబంధం లేదని అనడం.. ఇదంతా నాగబాబుకు రొటీన్ వర్క్ గా మారింది.
ఈ క్రమంలో ఇటీవల ఆయన మరోసారి ట్వీటారు. తన మేధస్సును అంతా ప్రయోగించారు. అది కూడా సామాన్య ఓటర్లను నిందించడంలో!
''రాష్ట్రం లో అభివృద్ది లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అవినీతి లో కూరుకుపోయిన ప్రభుత్వం, అని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు…. కష్ట సమయం లో నాయకులు దాక్కున్నారు అంటున్నావ్, ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా నువ్వెక్కడ దాక్కున్నావు? 40% ఓటు వేయని జనానికి ప్రశ్నించే హక్కు లేదు..'' ఇవీ నాగబాబు ఇటీవల చేసిన వరస ట్వీట్లు!
ఓట్లేసే జనాలు అంటే నాగబాబుకు ఎంత చులకనో అర్థం చేసుకోవడానికి ఈ ట్వీట్లు చాలు. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకుని ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఓటర్లను ఓటు హక్కును అమ్ముకున్న వాళ్లుగా, రెండు వేల రూపాయలు తీసుకుని ఓటేసిన వాళ్లుగా చిత్రీకరించేశారు శ్రీమాన్ నాగబాబు! ఓటంటే అది డబ్బు తీసుకుని మాత్రమే వేస్తారు.. అని నాగాబాబు తన మేధస్సుతో తేల్చి పడేశాడు!
ప్రజాస్వామ్యం అంటే ఈ పెద్దమనిషికి కాస్త అయినా అవగాహన ఉందా? లేక తను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి, తన అన్నా-తమ్ముడి పార్టీలు ప్రజల చేత తిరస్కరణకు గురైన ఫ్రస్ట్రేషన్ ఇంకా పోలేదా? ఇలా ఎన్నాళ్లు ప్రష్ట్రేట్ అవుతారు? ఎన్నికల సమయంలో రావడం పార్టీలు పెట్టడం, ఓడిపోవడం.. ఆ తర్వాత ఐదేళ్లు ఇలా గట్టున కూర్చోవడం, మళ్లీ రావడం ఓడిపోవడం.. ఆ పై ప్రజలను నిందిచడం! మీరు ఓడిపోయేదానికి ఓటర్లు ఏం చేస్తారు?
పవన్ కల్యాణ్ రాజకీయాన్ని అంతా చూశారు, నాగబాబూ రాజకీయాన్నీ చూశారు. వీళ్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజలు ఇవ్వాలనుకున్న తీర్పును ఇచ్చారు. ఆ తీర్పు తప్పు అనేది వీళ్ల బలమైన ఫీలింగ్. తన తమ్ముడిని సీఎంను చేసేసి, తనను ఎంపీగా చేసేయాల్సిందని నాగబాబు దురాశ. అందుకు తగ్గట్టుగా కష్టపడి ఉంటే.. కనీసం ఐదేళ్ల పాటు జనం మధ్యన ఉండి ఉంటే.. అదో లెక్క. ఏదో సినీ అభిమానాన్ని క్యాష్ చేసుకోవచ్చనే లెక్కలతో రాజకీయాల్లోకి వచ్చేసి..ఆ లెక్కలు కుదరకపోవడంతో.. ఊరికే ఉంటారు కదా అని సామాన్యులను, క్యూలో నిలబడి ఓటేసే జనాలను ఇలా అమ్ముడుపోయే వాళ్లు నిందించే ఇలాంటి వారిని కేసులు పెట్టి లోపలేస్తే కానీ బుద్ది రాకపోవచ్చు!
అయినా అమ్ముడుపోవడం గురించి మీరెందుకు మాట్లాడతారు నాగబాబు గారూ..18 మంది ఎమ్మెల్యేలను ప్రజలు ఇచ్చి మీ అన్న పార్టీని నిలబెడితే ఏం చేశారు? ఆ ఎమ్మెల్యేలను ఏ హక్కుతో వెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేశారు? కేంద్రమంత్రి పదవి కోసం 70 లక్షల మంది ఓటర్లు ఇచ్చిన ఎమ్మెల్యేలను అమ్ముకున్న మీరు.. రెండు వేల రూపాయలు- ఓటు అంటూ మాట్లాడటం నిజంగా నిస్సిగ్గుతనం! ఈ మంగళవారం మాటలు ఎంత తగ్గిస్తే అంతమంచిది!
విశ్వామిత్ర