దేశం మొత్తంమీద అన్ని రాష్ట్రాల్లోనూ మూడేళ్లకు గానూ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు 3,545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఒక్క ఏపీలో బస్సుల కొనుగోలుకు 7500 కోట్ల స్కామ్ జరుగుతోందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తోంది ప్రభుత్వం! చంద్రబాబు నాయుడుకు మతి ఉండి మాట్లాడుతూ ఉన్నారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కేటాయించిన బడ్జెట్ ఏమిటి, చంద్రబాబు నాయుడు మాటలు ఏమిటి?
అసలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బస్సుల కొనుగోలు జరుగుతూ ఉందా? ఆ విషయం గురించి చంద్రబాబుకు కనీస అవగాహన అయినా ఉందా? అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంతో తన దోపిడీ బయటపడిందని చంద్రబాబు నాయుడు ఇప్పుడు గగ్గోలు పెడుతూ ఉన్నారు. రివర్స్ టెండరింగ్ తో చంద్రబాబు అప్పుడే రేంజ్లో కమిషన్లు వసూలు చేశారో ఇప్పుడు బయటపడుతూ ఉంది. అందుకే ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటూ చంద్రబాబు నాయుడు కొత్త గగ్గోలు మొదలుపెట్టారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
''దేశంలో మొత్తంమీద అన్ని రాష్ట్రాల్లోనూ మూడేళ్ళలో 3545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగా చంద్రబాబు మాత్రం ఏకంగా ఏపీలోనే ఈ ఏడాది అసలు ఆంధ్రప్రదేశ్ కు బస్సుల కొనుగోలులో స్వేచ్ఛ, అధికారాలు లేకపోయినప్పటికీ నేరుగా కొనేస్తుందంటూ ఆయన ఏ ఉద్దేశ్యంతో చెబుతున్నారు? అసలు రాష్ట్రాలకు లేని అధికారాన్ని ఆయన ఏకంగా సృష్టించి దానికి క్విడ్ ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసేసి తమ కాలంలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచి బయటపడేందుకు కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు. అసలు ఆర్టీసీ అస్సలు బస్సులే కొనడం లేదు. ఏపీఎస్ఆర్టీసి నేరుగా బస్సుల కొనుగోలు చేసే పద్ధతే లేనప్పుడు ఇక ఒలెక్ట్రా నుంచి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?'' అని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది.
ఆర్టీసి నష్టాలతో నడుస్తుండడంతో బస్సుల కొనుగోలు విధానం నిలిపివేసి పూర్తిగా లీజు పద్ధతిలో సేకరిస్తూ ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలులోనూ అదే విధానం అవలంబిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శక విధానాలు జారీచేసింది. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక మొదలైన రాష్ట్రాల రవాణా సంస్థలు లీజు పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులును ఒలెక్ట్రాతో పాటు ఇతర సంస్థల నుంచి సేకరిస్తున్నాయి.
విశేషం ఏమిటంటే.. ఈ బస్సులకు చంద్రబాబు నాయుడు కూడా కితాబిచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 మే 23న అమరావతిలో ఒలెక్ట్రా ఏసీ బస్సులలో ప్రయాణించి వాటికి కితాబు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఫ్రభుత్వం వివిధ నగరాల్లోనూ, తిరుమలు-తిరుపతి మద్య ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆయనే మేఘా నుంచి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు.
పోలవరంలో ప్రధానమైన పనిని తక్కువ ధరకు అంటే 12.6శాతం తక్కువకు టెండర్‌ను కోట్ చేసిన మేఘా సంస్థ పెట్టుబడలు ఆ బస్సుల కంపెనీలో ఉన్నాయి. ఈ పనికి సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున అది పరిష్కారమైతే తప్ప పనిని ఆ సంస్థకు అప్పగించడం ప్రభుత్వానికి సాధ్యంకాదు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకులంతా పోలవరంలో వచ్చే నష్టాన్ని ఒలెక్ట్రా బస్సుల కొనుగోలు చేయడం ద్వారా క్విడ్ ప్రోకో కింద 7,500 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అసలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులునే కొనుగోలు చేసే విధానమే లేదు. కేంద్రం ప్రభుత్వం ఫేమ్-2 కింద 350 బస్సులను ఏపీకి మంజూరు చేసింది. ఈ బస్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగానే లీజు పద్ధతిలో ఉత్పత్తి సంస్థ నుంచి తీసుకొని 12 ఏళ్ళపాటు ఆ సంస్థలే నిర్వహిస్తే కిలోమీటర్‌కు నిర్ధారించిన ధర ప్రకారం చెల్లించే విధానాన్ని అమలు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏ పాటివో అర్థం చేసుకోవడం కష్టం కాదని విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.