చాలా మంది నోరు జారడం విషయంలో లోకేష్ ను ప్రస్తావించి కామెడీ చేస్తూ ఉంటారు. అయితే లోకేష్ కన్నా చంద్రబాబు నాయుడే చాలా సార్లు అడ్డదిడ్డంగా మాట్లాడేస్తూ ఉంటారనే విషయం మరుగున పడుతూ ఉంది. భారత దేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని , భారతదేశాన్ని అవినీతి భారత దేశం చేసేంత వరకూ నిద్రపోయేది లేదని అంటూ ప్రకటించింది లోకేష్ కాదు పాపం, అదంతా చంద్రబాబు నాయుడి ఘనతే!
అనేక సార్లు చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రకటనలు చేసి వీడియోలకు దొరికారు కూడా. ఇక ఎవరైతే ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు వేరే! రాహుల్ గాంధీ గురించి చెబుతూ రాజీవ్ గాంధీ అంటూ సంబోధించారు చంద్రబాబు నాయుడు. ఇలా చంద్రబాబు తడబాట్లు కొనసాగుతూ ఉంటాయి. చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తడబాట్లు ఇంకా అనేకం. వింటున్నారు కదా.. అని చంద్రబాబు నాయుడు ఏదేదో చెప్పుకుపోయిన సందర్భాలు అనేకం ఉంటాయి.
సత్యా నాదెళ్ల తండ్రి తన దగ్గర పని చేశాడంటూ, సత్యా నాదెళ్ల తన వల్లనే ఐటీ కోర్సులు చదివాడంటూ కూడా చంద్రబాబు నాయుడు పుక్కిటి పురాణాలను ఇట్టే చెప్పేశారు కూడా! అయితే అలాంటి మాటలు పూర్తి ఎదురుతన్నే సరికి చంద్రబాబు నాయుడు మళ్లీ అలాంటి చరిత్రలు చెప్పలేదు. ఇక యథావిధిగా హైదరాబాద్ ను కట్టింది తనేనంటూ తాపీ మేస్త్రీ మాటలను చంద్రబాబు నాయుడు రిపీట్ చేస్తూనే ఉంటారు. ఎన్ని సార్లు నవ్వులపాలైనా జనాలను ఈ విషయాలు నమ్మేట్టు చేయాలనే గోబెల్స్ ప్రయత్నాలను చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ ఉన్నారు.
ఇక ప్రధానమంత్రి మోడీ భజనను మళ్లీ షురూ చేసిన చంద్రబాబు నాయుడు ఈ క్రమంలో మరోసారి ప్రసంగించారు. గత ఏడాది ఎన్నికల ముందు మోడీ తప్పుడు మనిషి అని, మోడీ భార్యను వదిలేశాడని, మోడీకి కుటుంబం లేదని.. అవన్నీ తనకు ఉన్నాయని చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్లీ మోడీ భజన చేస్తూ ఉన్నారు. ఈ భజన చేయడంలో చంద్రబాబు తడబడ్డారు. 'ముఖ్యమంత్రి మోడీ..' అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి మోడీని కాస్తా, ముఖ్యమంత్రి మోడీగా మార్చారు చంద్రబాబు నాయుడు! చంద్రబాబుకు వయసు మీద పడటం వల్ల ఇలా మాట తడబడుతూ ఉందని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎవరేమిటి అనే విషయాలను ఆయన మర్చిపోతూ ఉంటారని, అందుకే మోడీని ముఖ్యమంత్రి అన్నారని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు.
ఆ సంగతేమో కానీ, గతంలో మోడీ భజన చేసే సమయంలో.. ముఖ్యమంత్రుల మీటింగులో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకసారి చెప్పిన వైనాన్ని ఇక్కడ గుర్తు చేయవచ్చు. మోడీ తొలిసారి ప్రధాని అయ్యాకా ముఖ్యమంత్రుల మీటింగ్ జరుగుతోందట. ఆ సమావేశానికి దేశంలోని సీఎంలంతా హాజరయ్యారు. వారిలో సహజంగా కేసీఆర్, చంద్రబాబులు కూడా ఉన్నారు. ఆ సమయంలో మోడీని అంతా అభినందించారు. అయితే వారందరికన్నా చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేశారట తనదైన శైలిలో.
'గతంలో ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించి, ప్రధాని అయిన ఏకైక వ్యక్తి మీరే..' అంటూ మోడీని కీర్తించారట చంద్రబాబు నాయుడు. ఈ విషయాన్ని తనే గుర్తించినట్టుగా చెప్పుకొచ్చారట. అయితే గతంలో పీవీ నరసింహారావు వంటి తెలుగు వాడు సీఎం గా వ్యవహరించి, ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యారనే కనీస అవగాహన లేకుండా, మోడీ భజన చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అలా మాట్లాడారని, ఈ తీరును చూసి తనబోటి వాళ్లంతా అక్కడే నవ్వుకున్నట్టుగా కేసీఆర్ వివరించారొకరసారి! అదీ చంద్రబాబు తీరు!