రానున్న ఎన్నికలు చంద్రబాబుకే కాదు, టీడీపీ భవితకు సవాల్ విసిరేవే. అందుకే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులో గతంలో ఎన్నడూ లేని భయం కనిపిస్తోంది. సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిందని బాబు పదేపదే చెప్పడం వెనుక ఆయన ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వీరోచితంగా పోరాడే వారికే రాజకీయ భవిష్యత్ ఉందని ఆయన నమ్ముతున్నారు. అలాంటి వారినే టీడీపీ ప్రోత్సహిస్తుందని బహిరంగంగానే చెబుతున్నారు.
టీడీపీ భవిష్యత్‌తో తన కుమారుడి రాజకీయ భవితవ్యం ముడిపడి ఉండడంతో చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకంజ వేయడం లేదు. అసలు పార్టీ బతికి ఉంటేనే, తన తదనంతరం వారసుడు లోకేశ్ రాజకీయాలు చేయగలడనే ఆలోచన ఆయన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. ఒక రకంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు మార్గనిర్దేశం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘వచ్చేవి ఆషామాషీ ఎన్నికలు కాదు. వైసీపీ రౌడీయిజాన్ని, దౌర్జన్యాల్నీ, అరాచకాల్నీ ఎదుర్కొని నిలవాలంటే ..ఢీ అంటే ఢీ అని తలపడే నాయకత్వం కావాలి. ఇష్టం లేని వారుంటే దండం పెట్టి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోండి. పార్టీ ఏమీ బాధపడదు. కొత్త వారికి అవకాశం వస్తుంది. పని చేయకుండా పదవులు కావాలని, పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటే ఉపయోగం ఉండదు’ అని బాబు తేల్చి చెప్పారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు సాగించిన రౌడీయిజం, దౌర్జన్యాల్నీ ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే జగన్ విజేతగా నిలిచారు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లోక్‌సభ సభ్యుల్ని ప్రలోభాలకు గురి చేసి తన పార్టీలో చంద్రబాబు చేర్చుకోవడంపై అప్పట్లో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురైంది. అంతేకాదు, ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా కట్టబెట్టి తన పతనాన్ని తానే కోరి తెచ్చుకున్నారు.
2019లో పార్టీ ఘోర పరాజయం పొందడం, ప్రస్తుతం చెప్పుకోతగ్గ స్థాయిలో అధికార పార్టీతో టీడీపీ ఢీ కొట్టలేని పరిస్థితి. చివరికి బాబు కంచుకోటనే వైసీపీ బద్దలు కొట్టగలిగింది. ఇదే బాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అందుకే వైసీపీతో ఢీ అంటే ఢీ అని తలపడే వాళ్లే ముందుకు రావాలని పిలుపునివ్వడం.
కుప్పంలో తానే వైసీపీని ఎదుర్కోలేని చంద్రబాబు, మిగిలిన నియోజక వర్గాలకు ఏం సందేశం ఇస్తారు? ముందు తాను అధికార పార్టీని ఢీ కొట్టి, ఆ తర్వాత అదే రోల్ మోడల్‌గా చూపితే బాగుండేది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని పక్కన పెట్టుకుని, పని చేసేవాళ్లకే పదవులు, లేదంటే దండం పెట్టి వెళ్లిపోండి అని బాబు చెప్పడంపై టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. మాజీ మంత్రి యనమల, తనయుడు లోకేశ్ లాంటి నిరుపయోగ నాయకులను తప్పించి, పోరాడే వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.
రానున్న ఎన్నికలను అధికార పార్టీ కూడా ఆషామాషీగా తీసుకోవడం లేదు. ఈ దఫా చంద్రబాబును ఓడిస్తే…ఇక శాశ్వతంగా ఆ పార్టీకి సమాధి కట్టేసినట్టు అని వైసీపీ ఆలోచిస్తోంది. మొత్తానికి మరో రెండున్నరేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నట్టే కనిపిస్తోంది.