అసలే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల నియంత్రణ, ఆన్‌లైన్ విక్రయాలు తదితర అంశాలతో ప్రభుత్వం సినిమాకే సినిమా చూపుతోంది. ఈ పరిస్థితుల్లో రకరకాల కారణాలతో కొన్ని పెద్ద చిత్రాల విడుదల కూడా ఆగిపోయింది. దీంతో అభిమానులు కాసింత నిరుత్సాహానికి గురి అయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలను అడ్డుకోవాలంటూ ఓ యువతి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య ఈ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. యువ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్రలను వక్రీకరించారనేది పిటిషనర్ ఆరోపణ. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సినిమా అత్యంత ప్రభావితం చేయగలిగే మాధ్యమం. ఇందులో మహనీయుల చరిత్రలను వక్రీకరించి చూపడం ద్వారా జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది పిటిషనర్ భావనగా ఉంది.
దీంతో ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వడంతో పాటు విడుదలను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యాన్ని సౌమ్య దాఖలు చేశారు. అల్లూరి, కుమురం భీం జీవన విధానాలకు విరుద్ధంగా ఈ సినిమాను చిత్రీకరించడం చట్టవ్యతిరేకమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా సెన్సార్ బోర్డు, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రచయిత విజయేంద్రప్రసాద్‌లను చేర్చారు.
ఇటీవల తెలంగాణ గాయని బెల్లి లలితపై అభ్యంతరకర దృశ్యాన్ని చిత్రీకరించడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌గా స్పందించిన సంగతి తెలిసిందే. పిటిషనర్ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుని లిప్ కిస్ సీన్‌ను తొలగించిన తర్వాత సినిమాను రన్ చేసుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో…తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకుంది.