రెండేళ్ల తర్వాత పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి చుక్కెదురైంది. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ ఫిరోజ్‌పూర్-మోగా రోడ్డు మార్గంలో పైరేనా గ్రామం వద్ద ఫ్లైఓవర్‌ను రైతులు దిగ్బంధించారు. దీంతో ఆయన పర్యటన ముందుకు సాగలేకపోయింది. దేశ చరిత్రలో ఏ ప్రధానికీ ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చివరికి ముందుకు వెళ్లే దారి లేకపోవడంతో రోడ్డుపైనే ప్రధాని 20 నిమిషాలు వేచి చూసి, ఆ తర్వాత రద్దు చేసుకుని ఢిల్లీకి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.
త్వరలో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతుల నుంచి వ్యతిరేకత తగ్గించుకునే క్రమంలో ప్రధాని మోడీ వేసిన ఎత్తులు ఫలించలేదు. తొలుత భగత్‌సింగ్‌తో పాటు ఇతర మరవీరుల జాతీయ స్మారక మందిరం వద్ద నివాళులు అర్పించేందుకు హెలికాప్టర్లో హుస్సేనీవాలాకు వెళ్లాల్సి ఉంది. అక్కడి నుంచి ఫిరోజ్‌పూర్ సభకు ప్రధాని బయల్దేరాలి. అయితే వర్షం, పొగమంచు ఉండడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఎయిర్‌పోర్టులోనే కొద్దిసేపు వేచి చూశారు.
అయితే రోడ్డు మార్గంలో రెండు గంటల సమయం పడుతుందని, అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని పంజాబ్ డీజీపీ భరోసా ఇవ్వడంతో ప్రధాని మోడీ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరారు. మెమోరియల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. కాన్వాయ్ ఫిరోజ్‌పూర్-మోగా రోడ్డు మార్గంలో పైరేనా గ్రామం వద్ద ఫ్లైఓవర్ పైకి చేరుకుంది. ప్రధాని పర్యటన గురించి తెలుసుకున్న రైతులు ఆ రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో 15-20 నిమిషాలు ప్రధాని ఫ్లైఓవర్‌పైనే ఉండాల్సి వచ్చింది.
పంజాబ్‌లో కాంగ్రెస్ పాలన సాగుతోంది. ఇదంతా ఉద్దేశ పూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడుతోంది. తన పర్యటనను రద్దు చేయడంపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఎట్టకేలకు ప్రాణాలతో బఠిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా.. మీ సీఎంకు నా ధన్యవాదాలు తెలపండి’ అని రాష్ట్ర భద్రతా అధికారులతో ప్రధాని వ్యంగ్యంగా అన డం గమనార్హం.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అన్నదాతలకు క్షమాపణ చెప్పి.. సాగు చట్టాలను ఉపసంహరించుకుం టున్నట్లు ప్రధాని ప్రకటించడంతో పాటు అత్యున్నత చట్టసభలో వారి రద్దు బిల్లులను ఆమోదించారు. అయినప్పటికీ రైతులు ప్రధాని పర్యటనను అడ్డుకోవడం ద్వారా…బీజేపీ ఆశించినట్టు జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.