తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో రాజకీయం చేయడం మాటెలా ఉన్నా ఆ పార్టీ అధినాయకత్వం ట్విటర్లో మాత్రం చాలా కుస్తీలే పడుతూ ఉంది. ఇప్పటికే నారా లోకేష్ బాబు ట్విటర్ రాజకీయ నేతగా చలామణి అవుతున్నాడు. లోకేష్ భవిష్యత్తుల్లో ఎమ్మెల్యేగా నెగ్గాలంటే ట్విటర్లో పోలింగ్ నిర్వహించాల్సిన రీతిలో ఆయన ట్విటర్ కే పరిమితం అవుతున్నారు. ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా ఆయన తన స్థాయికి మించిన పదాలతో ట్వీట్లు పెట్టేస్తూ ఉన్నారు. ఆ పదాలను ఆయన పలికి వినిపిస్తే అప్పుడు ప్రజల్లో కొద్దోగొప్పో ఆయన మీద నమ్మకం ఏర్పడే అవకాశాలున్నాయి.
ఇక చినబాబు ట్విటర్ గోల చాలదన్నట్టుగా చంద్రబాబు కూడా ట్విటర్లో చెలరేగిపోతూ ఉన్నారు. అయితే ఆ చెలరేగడంలో ముందూ వెనుక చూసుకోకుండా ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆశావర్కర్ల మీద చాలా రాజకీయమే చేస్తున్న సంగతి తెలిసిందే. జనాలకు పెద్దగా పట్టని ఆ వ్యవహారం గురించి తెగేదాకా లాగడానికి తెలుగుదేశం కంకణం కట్టుకుంది.
అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్లపై పోస్టు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి ఫొటోలకు ఈ మధ్యనే పాలాభిషేకం చేసిన ఆశాకార్యకర్తలు ఇప్పుడు, ఆయన ఫొటోలకు పాడెకట్టి మోస్తున్నారని చంద్రబాబు నాయుడు ఒక ట్వీటేశారు. అయితే ఏవో ఫొటోలు దొరికాయి కదా అని ట్వీట్ చేసేశారు. కానీ అలాంటి పిక్స్ ను చూస్తూ ఊరుకోరు కదా నెటిజన్లు! వాటి కథేంటో బయటకు తీశారు.
ఎప్పుడో రెండేళ్ల కిందట తెలంగాణలో ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారని తేలింది. ఇలా తెలుగుదేశం కథ అడ్డం తిరిగింది. చంద్రబాబును నెటిజన్లు ఏకేయడం మొదలుపెట్టారు. ఇక చేసేది లేక ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు చంద్రబాబు నాయుడు.
ఆఖరికి ట్విటర్ రాజకీయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇలా భంగపడుతూ ఉంది. బురద జల్లాలని చూడటం, ఆ బురద ప్రత్యర్థులకు అంటుకుపోయే సరికి ట్వీట్ డిలీట్ చేయడం.. స్వయంగా చంద్రబాబు నాయుడు అధికారిక ట్విటర్ ఖాతాలోనే ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉండటం తెలుగుదేశం పార్టీ దీన స్థితిని తెలియచెబుతోందని పరిశీలకులు అంటున్నారు.