తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రకటించిన కొత్త ఇన్ చార్జిల వ్యవహారం ఆ పార్టీని బలోపేతం చేయడం మాట అటుంచితే, చంద్రబాబు తీరులో లోటుపాట్లను బాగా చర్చనీయాంశంగా మారింది. మిగతా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల విషయంలో కూడా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నాయుడు ఇన్ చార్జిలను ప్రకటించారు.
ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు తను చేయగలిగింది ఏమీ లేక.. జగన్ ను అనుకరించారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో బీసీలకు మంచి ప్రాధాన్యతను ఇచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాగా లబ్ధి పొందారు. అప్పటికే ఉన్న జగన్ గాలికి తోడు కుల సమీకరణాలు కూడా కలిసి వచ్చి చాలా సంవత్సరాలుగా టీడీపీ గెలుస్తూ వచ్చిన సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది.
అలాంటి వాటిల్లో ఒకటి హిందూపురం ఎంపీ సీటు. 2004లో ఈ సీట్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అప్పట్లో ముస్లిం మైనారిటీకి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ నెగ్గింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున వరసగా రెండు సార్లు నిమ్మల కిష్టప్ప ఎంపీగా నెగ్గారు.
బీసీ సామాజికవర్గ జనాభా గట్టిగా ఉన్న సీటు కావడం, అందునా నిమ్మల కిష్టప్ప సొంత సామాజికవర్గం సాలె వాళ్లు గట్టిగా ఉన్న ప్రాంతం కావడంతో.. ఆయన విజయం సాధ్యం అయ్యింది. అలా గెలిచే అవకాశం ఉండటంతో నిమ్మల నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకునే వారు కాదు.
ఒక ఎంపీగా ఏనాడూ జనం మధ్యకు రాలేదు. వరసగా పదేళ్ల పాటు ఎంపీగా ఉన్నా.. కనీసం సొంత సామాజికవర్గం సమస్యలను పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. జనాభా లెక్కల ప్రకారం తాను గెలవడం ఖాయం అన్నట్టుగా ఢిల్లీలో కొన్నాళ్లు, అక్కడ నుంచి వస్తే పొలంలో చీనీ చెట్లకు నీళ్లు కట్టుకుంటూ మరి కొన్నాళ్లు పొద్దుపుచ్చే వారు నిమ్మల.
ఏం చేసినా, ఏం చేయకపోయిన తనదే విజయం అనే లెక్కలతో నిమ్మల మరీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. అందుకు తగిన రాజకీయ ఎదురుదెబ్బ గత ఎన్నికల్లో తగిలింది.
కురుబ సామాజికవర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ కు జగన్ టికెట్ ఇచ్చారు. కథ మారింది. ఈ నియోజకవర్గంలో కురుబల జనాభా కూడా గట్టిగా ఉండటం, జగన్ గాలి బలంగా వీయడంతో తెలుగుదేశం, నిమ్మలకు ఓటమి తప్పలేదు.
తెలుగుదేశం పార్టీ చాలా యేళ్లుగా హిందూపురం సీటును కురుబలకు ఇవ్వలేదు. జగన్ వ్యూహాత్మక ఎంపికతో టీడీపీకి షాక్ తగిలింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ కురుబ నేతను అక్కడ ఇన్ చార్జిగా ప్రకటించి.. తను కాపీ రాయుడు అనే విషయాన్ని చాటుకున్నారు.
పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారధిని ఇప్పుడు హిందూపురం పార్లమెంటరీ నేతగా ప్రకటించారు! కురుబ ఎంపీ ఉన్నారు కాబట్టి.. కురుబ నేతను ఇన్ చార్జిగా ప్రకటించి చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని మొదలుపెట్టారు!
అంతే కాదు..అనంతపురం పార్లమెంటరీ సీటు విషయంలోనూ ఇదే కథ. అక్కడ బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు జగన్. ఆయన జేసీ పవన్ ను ఓడిస్తూ విజయాన్ని నమోదు చేశారు. అనంతపురం విషయంలోనూ చంద్రబాబు నాయుడు అదే రాజకీయం చేశారు. బోయ సామాజికవర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులును తెచ్చి అక్కడ ఇన్ చార్జిగా ప్రకటించారు!
ఇదీ చంద్రబాబుకు చేతనైనది! ఇక్కడ మరో కామెడీ ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు చేతికి టీడీపీ పగ్గాలు దక్కినప్పటి నుంచి అనంతపురం జిల్లాల్లో ఇద్దరు బీసీ నేతల పేర్లే వినిపిస్తున్నాయి. అవే పార్థసారధి, కాలువ. వీరిద్దరూ తప్ప మరో బీసీ నేతకు చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వలేదు. వీళ్లను చూసి జనాలు విసిగిపోయి ఎమ్మెల్యేలుగా ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ వాళ్లనే తెచ్చి పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ చార్జిలుగా ప్రకటించారు!
ఈ నియామకాలు తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం మాట అటుంచి, చంద్రబాబు రాజకీయ వ్యూహ లేమిని చాటుతున్నాయి. సొంత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఓడిన వారిని ఆయన ఏకంగా పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ చార్జిలుగా చేయడం మరో ప్రహసనంగా మారింది.