కర్నాటకలో డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. శాండల్‌వుడ్‌కే పరిమితమైన ఈ కేసు క్రమంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నిన్న మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.
డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం విమర్శలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని, తాను నేరస్తురాలిని కాదని అనుశ్రీ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ అనుశ్రీకి ఓ మాజీ సీఎం అపన్నహస్తం అందించినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. సదరు యాంకర్‌కు ఆ మాజీ సీఎం ఫోన్ చేశారనే ప్రచారం, సమాచారం ఉన్నట్టు కుమారస్వామి చెప్పుకొచ్చారు.
కర్నాటక రాష్ట్రంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులున్నారని, వాళ్లలో యాంకర్ అనుశ్రీకి ఫోన్ చేసిందెవరు? ఆ కేసులో సాయం చేస్తున్నదెవరో ప్రభుత్వం తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
డ్రగ్స్ కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా అనుశ్రీ వీడియోపై సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుశ్రీ అరెస్ట్ కాకుండా ఓ గాడ్ ఫాదర్ రక్షిస్తున్నట్టు తీవ్ర ఆరోపణలు చేశారు.