ఈరోజు చంద్రబాబు నాయుడు తనను హౌస్ అరెస్ట్ చేశారని గగ్గోలు పెడుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నయం ఇంట్లో హాయిగా ఏసీలో కూర్చుని, టీవీలు చూస్తూ కూర్చునే అవకాశాన్ని ఇచ్చారు పోలీసులు. గతంలో చంద్రబాబు నాయుడు తన ప్రతిపక్ష నేతను ఎలా అరెస్ట్ చేయించారో అందరికీ తెలసిన సంగతే. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు కట్టడిచేసిన వైనం ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది.
ఆ వ్యవహారంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం చాలా ధారాళంగా వ్యవహరించిందని పరిశీలకులు అంటున్నారు. అప్పుడు జగన్ విశాఖకు వెళ్లింది ప్రజా సంబంధ వ్యవహారం విషయంలో. ప్రజలంతా మూకుమ్మడిగా ధర్నాకు రోడ్డు మీదకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేత విశాఖకు వెళ్లే ప్రయత్నం చేయగా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ ను ఆపింది. అక్కడ నుంచి బలవంతంగా తిప్పిపంపారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లోనే పెట్టింది జగన్ ప్రభుత్వం. ఆయనను రోడ్డు మీద ఆపలేదు, లేదా వాహనంలోనే ఉంచలేదు. హాయిగా ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకొమ్మన్నట్టుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది.
అయితే తాము గతంలో చేసిన వ్యవహారాలను జనాలు మరిచిపోయారని తెలుగుదేశం పార్టీ అనుకుంటూ ఉండవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్యమిస్తున్నది తన పార్టీ వారి కోసం. అధికారం చేతిలో ఉన్నప్పుడే ఓవరాక్షన్ చేసిన వారు కొందరు ఇప్పుడు అందుకు సంబంధించి ఏవైనా రియాక్షన్స్ ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే వాటిని చంద్రబాబు నాయుడు భరించలేకపోతూ ఉన్నారు.
కే ట్యాక్స్ లు వసూలు చేసినప్పుడు, పల్నాడు ఏరియాలో కొన్నికులాల వారిని లక్ష్యంగా చేసుకుంటూ ఒక కులం వారు విరుచుకుపడినప్పుడు చంద్రబాబు నాయుడుకు వాస్తవం అర్థం కాలేదు. ఇప్పుడు ఒక కులం వారు తమ దాష్టీకాలను చేయలేకపోతున్నందుకు చంద్రబాబు నాయుడు చాలా ఫీల్ అవుతున్నారని పరిశీలకులు అంటున్నారు. వారి కోసం శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. తను అక్కడకు వెళ్లి దాష్టీకాలు చేయమని తమ వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే చంద్రబాబుకు అంత అవకాశం ఇవ్వలేదు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ఇంటికే పరిమితం చేసింది. మరోవైపు తెలుగుదేశం శిబిరాలు ఖాళీ అయిపోయాయి కూడా. అక్కడ నుంచి టీడీపీ కార్యకర్తలను పోలీసులు దగ్గరుండి సొంతూళ్లకు పంపించారు. వాళ్ల వాళ్ల సొంతూళ్లలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి వారిని చేర్చారు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు రిలీఫ్ గా ఫీలవొచ్చు.