ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం పనులో చెయ్యాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి అస్సలూ తెలియడంలేదు. ట్విట్టర్లో ప్రభుత్వాన్ని అధిక్షేపించడం, రాష్ట్రంలో ఏ మూల హత్యామరణం సంభవించినా కొడుకుని అక్కడికి పరామర్శ పేరుతో పంపించి ఆ హత్యకి పరోక్ష కారణం ప్రభుత్వమే అంటూ మీడియా మైకులు ముందు రాజకీయం చేయడం..ఇంతకంటే ఏమీ చెయ్యలేకపోతున్నారంటే తెదెపా రాజకీయ దీపం కొండెక్కడానికి సిద్ధంగా ఉందని సంకేతమే.
40 ఏళ్ల రాజకీయవృద్ధుడు అలా ఉంటే జనసైనికులు మాత్రం రోడ్లు బాగోలేదంటూ రోడ్ల మీదకొచ్చి ఉద్యమం చేపట్టారు. మీడియా కూడా కవర్ చేస్తోంది. ప్రజలు మెచ్చేది ఇదే కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది, నిలదీయాల్సింది ఇలాంటి విషయాల్లోనే. ప్రజాప్రయోజనార్థం సరిద్దుకోవాల్సిన తప్పులుంటే ప్రభుత్వం సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది.
పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా ప్రజలకోసం పని చేసినప్పుడే ప్రజలు తమ గుండెల్లో ఆ పార్టీలకి స్థానం కల్పిస్తారు. అంతే కానీ కేవలం స్వార్థ రాజకీయల కోసం డ్రామాలాడుతూ, పుణ్యకాలం ఎప్పుడో అప్పుడు తన్నుకుంటూ వస్తుందిలే..అప్పుడెలాగో మళ్లీ పదవులు వెలగబెడ్తాములే అనుకుంటూ కాలక్షేపం చెస్తే పని జరగదు. ఆ రోజులిప్పుడు లేవు.
అయినా ఎక్కడైనా హత్యో, సహజ మరణమో సంభవిస్తే దానికి కారణమేమిటో స్థానికులకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు అక్కడికొచ్చి దీనికి కారణం ప్రభుత్వవైఫల్యమే అని అంటే జనం రేసుగుర్రంలో శృతి హాసన్ లాగ లోపల్లోపల నవ్వుకుంటారే తప్ప ఒక్క ఓటు కూడా వెయ్యరని లోకేష్ కి ఎలాగూ తెలియదు. ఆయనగారి తండ్రిగారికి కూడా ఆ ప్రాధమిక సూత్రం అర్థం కావట్లేదు.
ఏం రాజకీయం చేసి జగన్ మోహన్ రెడ్డి కుర్చీ లాగుదామా అనే తప్ప, ఏం చేసి ప్రజల మనసుల్ని గెలుచుకుందాం అనే లెక్క మాత్రం వేసుకోరు బాబు గారు. ఆ అమాయకత్వమే ఆయన పార్టీకి నిలువెత్తు గొయ్యి తవ్వుతోంది.
పదవిలో ఉన్నప్పుడు మరొక చాణక్యుడని, సుదీర్ఘ అనుభవమున్న రాజనీతిజ్ఞుడని డప్పు కొట్టించుకుని తీరా ప్రతిపక్షంలోకొచ్చాక కనీసం ఆ డప్పులో సగమన్నా నిజమనిపించేలా ప్రవర్తించాలి కదా. అబ్బే…తెదెపా అధినేత రాజకీయశూన్యుడు.
ఇన్నాళ్లూ గాలివాటమ్మీదో, పొత్తుల పుణ్యానో పదవులు వెలగబెట్టినప్పుడు పత్రికల వాళ్లు సాహో అంటే జనం ఓహో అనుకున్నారు. ఈయనగారి అసలు డొల్లతనం ఇప్పుడు బయటపడుతోంది.
జగన్ ని చూసి నేర్చుకోమంటే తమకి ఎలాగూ నచ్చదు కనుక కనీసం జనసైనికుల్ని చూసైనా కాస్త ప్రజాప్రయోజనకరమైన రాజకీయ పాఠం నేర్చుకోండి బాబు గారు.
– చాట్రగడ్డ బాపయ్య