మరో మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగ వివాదాన్ని తీసుకొచ్చింది. వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే… అనవసరంగా నీలాపనిందలు మోయాల్సి వస్తుందని పురాణ కథలు చెబుతాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ చంద్రుని ముఖం చూశారో తెలియదు కానీ, నీలాపనిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక పాలన సాగిస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేచింది. దీనికి ప్రభుత్వం వైపు నుంచి తప్పులు లేకపోలేదు. కేంద్రమార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని ఏపీలో వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. ఇందులో భాగంగా మండపాలు ఏర్పాటు చేసి వినాయకుని కొలువుదీయ వద్దని ప్రభుత్వం పేర్కొంది.
ఈ నేపథ్యంలో బీజేపీ తన మార్క్ ఆందోళన చేపట్టింది. దీనికి కొన్ని హిందూ ధార్మిక సంఘాలు, తాజాగా టీడీపీ వంత పాడుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి సరైన వివరణ, కౌంటర్ లేకుండా పోయాయి. జగన్ ప్రభుత్వానికి ఇతరేతర ఉద్దేశాలు లేకపోయినా… వివాదమైన తర్వాతైనా సరిదిద్దుకుని వుంటే బాగుండేది.
అలా కాకుండా మాటకు మాట సమాధానం అనే రీతిలో వివాదాన్ని మరింత పెద్దది చేసుకునేలా చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా నిబంధనల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో… ఇటీవల వైఎస్సార్ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించడంతో సమాధానం చెప్పుకోలేని దుస్థితి. వైఎస్సార్ వర్ధంతినే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ, ప్రభుత్వంపై విమర్శల తూటాలు పేల్చుతున్నాయి.
డీజీపీ గౌతం సవాంగ్‌కు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ రాసిన లేఖల్లో ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.
‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా పెద్దఎత్తున హాజరై నివాళులు అర్పించారు. సీఎం స్వయంగా పాల్గొన్నారు. ఇటీవల మొహర్రం సందర్భంగా పీర్ల ఊరేగింపుతోపాటు 30 నుంచి 40 మందిని అనుమతించారు. కరోనా రెండో దశలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది. వినాయక చవితి హిందువులకు ముఖ్య పండగ. పందిళ్లు వేసి ప్రజలు వేడుకగా నిర్వహించుకోవడం అనాదిగా వస్తోంది. ఈ నేపథ్యంలో వేడుకలపై ఆంక్షల్ని వెనక్కి తీసుకోవాలి’ అని డీజీపీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
ఇదే కోణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా మాట్లాడ్డం విశేషం. ఇడుపులపాయతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాలకు వర్తించని కోవిడ్ నిబంధనలు చవితి ఉత్సవాలకు ఎలా వర్తిస్తాయి? తెలంగాణలో అనుమతి చ్చినపుడు ఇక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారు? అని చంద్రబాబు నిలదీయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
చంద్రబాబైనా, సోము వీర్రాజైనా, పవన్‌కల్యాణ్ అయినా, సామాన్య ప్రజానీకమైనా… జగన్ ప్రభుత్వానికి వేస్తున్న ప్రశ్న ఒక్కటే! వైఎస్సార్ వర్ధంతికి లేని కోవిడ్ నిబంధనలు వినాయక చవితికి మాత్రమే ఎందుకు? దీనికి సమాధానం చెప్పాలి.
కేంద్ర మార్గదర్శకాలు, ఇతరత్రా అంశాలు కేవలం సాంకేతికమైనవే. అలాగే పొరుగునే ఉన్న తెలంగాణలో మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తుండడాన్ని జగన్ ప్రభుత్వం ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవడం లేదో అర్థం కాని ప్రశ్న. వివాదాలు కావాలనే ప్రభుత్వం కోరుకుంటోందా? ప్రతిపక్షాలు కోరుకున్నట్టుగా ప్రభుత్వం నడుచుకుంటోందా? ఏమో…జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే ఏమీ అర్థం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.