తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో చెడుగుడు ఆడేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. తరచూ చంద్రబాబు మీద ధ్వజమెత్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్తిబాబు, కొడాలి నాని, అంబటి రాంబాబు.. వీళ్లంతా తమదైన రీతిలో చెలరేగిపోయారు. గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలన్నింటికీ .. వడ్డీతో బదులిచ్చారు. చంద్రబాబు నాయుడు నెల రోజుల నుంచి అమరావతి ఆందోళనలు అంటూ ఏమేం మాట్లాడారో ఆయా అంశాలన్నింటినీ… ఒక్కదాన్ని కూడా వదలకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా వదల్లేదు సుమా!
వైసీపీని టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు నాయుడు ఏయే అంశాలను ప్రస్తావించారో.. వాటన్నింటినీ సభలో గుర్తు చేశారు. జగన్ మీద చేసిన విమర్శలను, వైసీపీకి చంద్రబాబు నాయుడు ఆపాదించిన దురుద్దేశాలను అన్నింటినీ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దేనికదిగా కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ అధినేత, సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసిన సవాళ్లలోని డొల్లతనాన్ని వైసీపీ వాళ్లు కడిగేశారు.
గత నెల రోజులుగా.. తెలుగుదేశం అనుకూల వర్గాలు జగన్ ను విమర్శించని తీరంటూ లేదు. వాటన్నింటికీ సమాధానంలా వైసీపీ నేతల ప్రసంగాలు సాగాయి. చంద్రబాబు నాయుడు విసిరిన రాజీనామా సవాలు మీద కూడా వైసీపీ ఎమ్మెల్యేలు స్పందించారు. ఏదైనా వాదాన్ని వినిపించాలనుకునే వాళ్లు.. దమ్మూధైర్యం ఉంటే రాజీనామాలు చేశారని, రాజీనామాలు చేసి నెగ్గడం వైసీపీకి కొత్త కాదని.. దాని చరిత్రే రాజీనామాలతో మొదలైందని చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబుకు అమరావతి మీద అంత ప్రేమే ఉంటే.. దమ్ముంటే ఆయన, తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు.
ఇక వైఎస్ మరణం గురించి కూడా తెలుగుదేశం వాళ్లు నీఛంగా మాట్లాడారని, ప్రజల చేత తీవ్రమైన తిరస్కరణ పొంది, కొడుకును కూడా గెలిపించుకోలేని స్థితి కన్నా చనిపోవడం దారుణం ఏమీ కాదని.. రాజకీయంగా తిరస్కరణ పొందిన చంద్రబాబు స్థితి గురించి వైసీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు.
అలా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కొక్కరుగా లేచి.. ఒక్కో పాయింట్ ను పట్టి కడిగేస్తుంటే.. ఒక దశలో తెలుగుదేశం వాళ్లు మారు మాట్లాడలేకపోయారు. కొడాలినాని ప్రసంగాన్ని తెలుగుదేశం వాళ్లు కూడా నవ్వుతూ విన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా నవ్వుకుంటుంటే చంద్రబాబు మాత్రం మొహం సీరియస్ గా పెట్టి.. వాళ్ల మాటలు వినపడనట్టుగా వ్యవహరించారు.
వార్తా పత్రికను తిరగేయడం, ఏవే తెల్ల కాగితాలను పరిశీలించడం.. ఎప్పుడో కానీ ప్రసంగిస్తున్న వారి మాటలను విననట్టుగా చంద్రబాబు నాయుడు కనిపించారు. ఆమాటలన్నీ వింటే.. తన పై చెలరేగిన ఘాటు విమర్శలు అసలు తనకు వినపడనట్టుగా చంద్రబాబు నాయుడు పక్క చూపులు చూస్తూ కూర్చున్నారు. వాటిలో దేనికైనా సమాధానం ఉండుంటే చంద్రబాబు నాయుడు అలా కామ్ గా ఉండే వారు కాదేమో!