శవ రాజకీయాలకు పెట్టింది పేరుగా మారిపోయింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడైనా వ్యక్తి మరణిస్తే చాలు అక్కడ వాలిపోతున్నారు తండ్రికొడుకులు చంద్రబాబు-లోకేష్. ఆ మృతదేహాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుతున్నారు. చివరికి ఈ శవ రాజకీయాలు ఎంతకు దారితీశాయంటే.. చంద్రబాబు వచ్చేంత వరకు అంత్యక్రియలు చేయకుండా అడ్డుకుంటున్నారట తెలుగు తమ్ముళ్లు. స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయి చేస్తున్న ఆరోపణ ఇది.
“అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ఎవరు రాలిపోయినా రాబందులాగా చంద్రబాబు అక్కడ వాలిపోతున్నారు. విషాదంలో ఉన్నవారిని మరింత క్షోభకు గురిచేస్తున్నాడు. కొన్ని చోట్ల ఈయన వెళ్ళేదాకా అంత్యక్రియలు జరగకుండా పచ్చ బ్యాచ్ అడ్డుకుంటోంది. చావులనూ వివాదం చేయడం దివాళాకోరు రాజకీయం అవుతుంది.”
ఇలా చంద్రబాబు, అతడి పార్టీ సభ్యులు చేస్తున్న శవరాజకీయాల్ని ఎండగట్టారు ఎంపీ. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎవ్వర్నీ బతకనివ్వరంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని కూడా విజయసాయి తిప్పికొట్టారు.
“వైసీపీ మళ్లీ వస్తే ఎవరూ బతకలేరంటూ చంద్రబాబు, కొందరు స్వార్ధపరులు గింజుకుంటున్నారు. అవును…వైసీపీ అధికారంలోకి వస్తే దళారులు, లంచగొండులు, అక్రమార్కులు బతకలేరు. ఖజానాను, భూములను కొల్లగొట్టే రాబందులు బతకలేరు. ప్రజలకు మాత్రం సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతూనే ఉంటాయి.”
చంద్రబాబుపై సూటిగా, సుత్తిలేకుండా విమర్శలు చేసే విజయసాయి.. అదే టైమ్ లో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, సాగిస్తున్నన్న అభివృద్ధి పనుల్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల 52 లక్షల వినతులు పరిష్కారమయ్యాయని,ఇదొక రికార్డ్ అంటూ సచివాలయ వ్యవస్థను కొనియాడారు విజయసాయి.