గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అసెంబ్లీ వేదికగా సంచలన ఆరోపణ చేశారు. మమతాబెనర్జీ గుమ్మడి కాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా టీడీపీ నేతలు పొంతన లేని విమర్శలు చేస్తున్నారు. మాటకు మాటే సమాధానం అనే పద్ధతిలో తప్ప, వాటికి ఓ రీతి లేకుండా పోయింది.
టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏకంగా తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలతో పాటు కొంత మంది అధికారుల పోన్లను కూడా వైసీపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఇందుకు ఓ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు పెగాసస్ కొనుగోలు చేశారన్నది అబద్ధమన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అలాంటి సాఫ్ట్‌వేర్‌ను కొనలేమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధి తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. పెగాసస్‌పై మమతా బెనర్జీకి అవగాహన లేకపోవచ్చన్నారు.
మమత, జగన్‌కు పీకేనే స్ట్రాటజీలు రూపొందిస్తున్నారని చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల ముందు మమతాబెనర్జీతో కలిసి దేశమంతా చంద్రబాబు కలియదిరిగిన రోజులు సోమిరెడ్డి మరిచిపోయినట్టున్నారు.
జగన్‌కు వ్యతిరేకంగా మమతతో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై సోమిరెడ్డి ఏమంటారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు దగ్గరగా తిరగడం వల్ల ఆయన వ్యవహారాలు ఆమెకు తెలుసని వైసీపీ నేతలు అంటున్నారు. మమతాబెనర్జీ వాస్తవాలు చెప్పడంతో టీడీపీ నేతలు వణికిపోతున్నారన్నారు.