శవ రాజకీయాలు చేయడంతో తండ్రి చంద్రబాబును మించిన తనయుడిగా లోకేశ్ రోజురోజుకూ ఎదుగుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మామూలు మరణాలను కూడా జగన్ సర్కార్ పాలనా వైఫల్యానికి ముడిపెట్టి విమర్శించడం లోకేశ్, చంద్రబాబులకే చెల్లిందని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. వీఓఏ నాగలక్ష్మి ఆత్మహత్యపై లోకేశ్ రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించడం ఆయన శవ రాజకీయానికి నిదర్శనమే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజధాని ప్రాంతంలో మామూలు మరణాలను కూడా అమరావతి కోసం అంటూ ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని టీడీపీ డ్రామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత అనేక సందర్భాల్లో శవ రాజకీయాలకు లోకేశ్ తెరలేపి, కొన్ని సందర్భాల్లో అభాసుపాలయ్యారు. తాజాగా వీఓఏ నాగలక్ష్మి ఆత్మహత్యపై కూడా లోకేశ్ అదే రకమైన రాజకీయానికి పాల్పడ్డారనే విమర్శలు వస్తున్నాయి.
వీఓఏ నాగలక్ష్మిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నేత చేసిన హత్యగా లోకేశ్ చిత్రీకరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి వీఓఏ నాగలక్ష్మి తాము చెప్పినట్టు వినడంలేదని వైసీపీ నేత నరసింహారావు వెంటాడి వేధించడంపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఆమె ఆత్మహత్యకు పాల్పడేది కాదన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా మహిళని రక్షించలేకపోయారంటే పోలీసు వ్యవస్థ ఎంతగా భ్రష్టు పట్టిందో అర్థం చేసుకోవచ్చన్నారు.
సొంత చెల్లిని తెలంగాణ తరిమేసి, బాబాయ్‌ని చంపేసి ఆయన కుమార్తె ప్రాణాలకు రక్షణలేకుండా చేసిన జగన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని గ్రామస్థాయిలో కూడా వైసీపీ నేతలు మహిళల ప్రాణాలు తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడేమి జరిగినా చివరికి జగన్ పార్టీకి, జగన్‌కు అంటకట్టి విమర్శలు చేయడంలో లోకేశ్ రాటు తేలిపోయారు.
అరిగిపోయిన రికార్డులా షర్మిల, వివేకా హత్య, ఆయన కుమార్తె సునీత గురించి గుర్తు చేయకుండా లోకేశ్ ఏదీ మాట్లాడలేని పరిస్థితి. మరి లోకేశ్ స్ట్రాటజీ ఎంత వరకూ కలిసి వస్తుందో కాలమే తేల్చాల్సి వుంది. కానీ శవరాజకీయాలు చేయడంలో లోకేశ్‌తో పోల్చితే చంద్రబాబే నయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.